పాక్ వ్యక్తి నా చావును కోరాడు: ఫేస్‌బుక్ అధిపతి జుకర్‌బర్గ్
వాషింగ్టన్: ఫేస్‌బుక్ పేజీలో అభ్యంతరకర సమాచారము ఉందనే కారణంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ అతివాది తనను చంపుతానన్నాడని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. మహ్మద్ ప్రవక్తను దూషిస్తూ ఉన్న ఓ పోస్టు షేర్ అయినందుకు పాక్ అతివాది తనను చంపుతానని బెదిరించాడని జుకర్‌బర్గ్ వెల్లడించారు.
అయితే ఈ విషయం మీద భారత్, పాక్ నెటిజన్ల మధ్య ఫేస్‌బుక్‌లో పెద్ద యుద్ధమే జరుగుతోందన్నారు. ప్రతి దేశ చట్టాలను గౌరవిస్తామని, అయితే ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసే సమాచారాన్ని మేము అడ్డుకోలేమని జుకర్ చెప్పారు. ఎవరైనా తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోడానికి ఫేస్‌బుక్ ఓ వేదికగా ఉంటుందన్నారు.

అయితే ఆ పాకిస్థాన్ అతివాదిని జుకర్ బర్గ్ గుర్తించలేదు. కాగా, ఓ వ్యక్తి చేసిన దానికి పాకిస్థాన్ దేశాన్నంతటినీ నిందించడం సరికాదని పాకిస్థాన్‌కు చెందిన మరో వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా తెలిపాడు. దీనికి స్పందించిన జుకర్‌బర్గ్.. తనకు పాకిస్థాన్ దేశానికి చెందిన స్నేహితులు కూడా ఉన్నారని చెప్పారు.
పాకిస్థాన్‌లోని చాలా మంది తన చావును కోరుకున్న వ్యక్తిలాంటి వారు కాకపోవచ్చని జుకర్‌బర్గ్ తెలిపారు. ప్రజలు తమ భావాలను పంచుకోవడానికే తాము ఫేస్‌బుక్‌ను రూపొందించామని చెప్పారు. అయితే కొందరు కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని ప్రజలు తమ భావాలను ఎలాంటి భయం లేకుండా ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించవచ్చని తెలిపారు. అయితే తాము వివిధ దేశాలకు సంబంధించిన చట్టాలను అనుసరిస్తూ వ్యవహరిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications