పొరుగున భారీ భూకంపం: ఇక్కడ ప్రకంపనలు
Afghanistan earthquake: పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు దీనివల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. దీని తీవ్రత మాత్రం భారత్‌లో కనిపించింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా రికార్డయింది. ఈ ఉదయం సరిగ్గా 11:26 నిమిషాలకు భూమి కంపించింది. రాజధాని కాబుల్‌కు ఆగ్నేయ దిశగా ఉన్న బదక్‌షాన్ ప్రావిన్స్‌లోని జెబాక్- గోల్‌కనేష్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.

భూ ఉపరితలం నుంచి 255 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.
ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లు బీటలు వారినట్లు వార్తలొస్తోన్నాయి.
కాగా ఈ భూకంప తీవ్రత భారత్‌లో కనిపించింది. బదక్‌షాన్ ప్రావిన్స్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న ప్రాంతం కావడం వల్ల తీవ్రత జమ్మూ కాశ్మీర్‌లో పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. అలాగే.. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోనూ దీని తీవ్రత కనిపించింది.
గత ఏడాది అక్టోబర్‌లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1,500 మంది వరకు మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టం అయ్యాయి అప్పట్లో.












Click it and Unblock the Notifications