అఫ్గానిస్తాన్: కాబుల్ మిలటరీ ఆస్పత్రిపై ఐఎస్ దాడి, 20 మందికి పైగా మృతి - Newsreel

అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ఒక మిలటరీ ఆస్పత్రిపై జరిగిన బాంబుల దాడి, తుపాకీ కాల్పుల్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 16 మందికి పైగా గాయపడ్డారు.
400 పడకల సర్దార్ దావూద్ ఖాన్ ఆస్పత్రి వెలుపల రెండు భారీ పేలుళ్లతో దాడి ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
అనంతరం, సాయుధులు ఆసుపత్రిలోకి చొరబడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ ఐఎస్-కే ఈ దాడికి పాల్పడినట్లు ఆ తరువాత ప్రకటించింది.
దాడి సమయంలో తనను ఒక గదిలో దాక్కోమన్నారని, అక్కడి నుంచి తుపాకీ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయని ఒక డాక్టర్, ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.
పేలుళ్లలో ఒకటి ఆత్మాహుతి దాడి అని సయ్యద్ అహద్ ఈవీఎన్ మీడియాకు చెప్పారు.
"ఓ ఆఫ్గాన్ పౌరుడిగా ఈ యుద్ధం, ఆత్మాహుతి దాడులు, పేలుళ్లతో నిజంగా విసిగిపోయాను. ఇంకా ఎన్నాళ్లు ఈ బాధలు భరించాలి?" అంటూ ఆయన వాపోయారు.
ఐఎస్-కే సాయుధులు ఆస్పత్రి గేటు దగ్గర ఒక బాంబు పేల్చిన తరువాత లోపలికి ప్రవేశించారని తాలిబాన్ ప్రతినిధి బిలాల్ కరీమి బీబీసీకి తెలిపారు.

తాలిబాన్ మిలిటెంట్లు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఐఎస్-కే సాయుధులు ప్రాణాలు కోల్పోయారని, ఒకరిని సజీవంగా పట్టుకున్నారని కరీమి వెల్లడించారు.
హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రి ప్రాంగణంలోకి దిగిన తాలిబాన్ ప్రత్యేక బలగాలు దుండగులను లోనికి ప్రవేశించకుండా నిరోధించాయని, గేటు దగ్గర, భవన ప్రాంగణంలో ఎదురు కాల్పులు జరిపారని, దుండగులంతా 15 నిమిషాల్లో హతమయ్యారని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు.
పశ్చిమ దేశాల మద్దతు ఉన్న మునుపటి అఫ్గాన్ ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ను తాలిబాన్లు ఉపయోగించడం ఇదే మొదటిసారి అని ఆ వార్తాసంస్థ తెలిపింది.
ఆగస్టులో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత జరిగిన తాజా దాడి ఇది.
ఐఎస్-కే అంటే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్. అఫ్గాన్ పౌరులు, తాలిబాన్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడ్డామని ఐఎస్-కే ఇప్పటికే ప్రకటించింది.
ఆగస్టులో కాబూల్ విమానాశ్రయంపై ఈ గ్రూపు జరిపిన బాంబు దాడిలో 150కి పైగా పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించారు.
సర్దార్ దావూద్ ఖాన్ ఆసుపత్రిపై గతంలోనూ ఓ దాడి జరిగింది. 2017లో సాయుధులు డాక్టర్లుగా వేషం కట్టి భవనంలోనికి ప్రవేశించారు. ఈ దాడిలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ దాడికు కూడా తామే పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- 'ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications