న్యూయార్క్ రైల్లో భారతీయ మహిళతో వెకిలి, అడ్డుకున్న వారిపై తిట్లు
అమెరికాలో జాత్యాహంకార దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, మరో ఘటన వెలుగు చూసింది. న్యూయార్క్ రైలులో భారతీయ మహిళను కొందరు వేధించారు. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టారు.
న్యూయార్క్: అమెరికాలో జాత్యాహంకార దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, మరో ఘటన వెలుగు చూసింది. న్యూయార్క్ రైలులో భారతీయ మహిళను కొందరు వేధించారు. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టారు.
ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. మా దేశం నుంచి వెళ్లిపోవాలని ఆమె ముందు తిట్ల దండకం అందుకున్నారు. ఇండియన్లు, బ్రౌన్ స్కిన్ వారు ఇక్కడ ఉండవద్దని హెచ్చరించారు. వేధిస్తున్న వారిని కొందరు అడ్డుకోబోగా వారి పైన కూడా తిట్ల దండకం అందుకున్నారు.

కాన్సాస్‌లో ఇప్పటికే ఆడమ్ ప్యూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో హైదరాబాదుకు చెందిన శ్రీనివాస్ మృతి చెందగా, అలోక్ రెడ్డి అనే వ్యక్తికి గాయాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొలరాడోలో ఓ భారతీయుడు ఇంటి పైన దాడి చేశారు.
కాగా, కాన్సాస్‌లో భారత ఇంజినీరు కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యుడు అమీ బెరా తీవ్రంగా ఖండించారు. జాతి వివక్ష, విదేశీయులపై వ్యతిరేకత వంటి భావాలకు అమెరికాలో స్థానం లేదన్నారు.
శ్రీనివాస్ సహా ఇతరులపై జరిగిన దాడి మతిమాలినదని వ్యాఖ్యానించారు. బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.
కాన్సాస్ కాల్పులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని దక్షిణాసియా బార్ సోసియేషన్ (ఎస్‌ఏబీఏ) ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. మరోవైపు, కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను కేన్సస్ గవర్నర్ సామ్ బ్రౌన్ బ్యాక్, మిస్సౌరీ గవర్నర్ ఎరిక్ గ్రీటెన్స్ తీవ్రంగా ఖండించారు.












Click it and Unblock the Notifications