ఇజ్రాయెల్ వెళ్లే భారతీయులకు ఎయిర్ ఇండియా బ్యాడ్ న్యూస్..!
పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ ఏడాది ఇజ్రాయెల్ పై హమాస్ దాడి, అనంతర పరిణామాల నేపథ్యంలో ఇరాన్, సిరియా, లెబనాన్ వంటి దేశాలు కూడా ఇప్పుడు పరోక్షంగా యుద్ధరంగంలో ఉన్నాయి.
తాజాగా వరుసగా చోటు చేసుకుంటున్న హమాస్ నేతల హత్యలు ఇరాన్ తో పాటు దాని అరబ్ మిత్రదేశాల్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష దాడికి అరబ్ దేశాలు సిద్దం కావొచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆగస్టు 8 వరకూ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు తమ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఇవాళ ప్రకటించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అక్కడ ఉన్న భారతీయులకు అవసరమైన సహాయాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కాలంలో టెల్ అవీవ్‌కు రాకపోకల బుకింగ్‌లను రీషెడ్యూల్ చేయడం, రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ఇజ్రాయెల్, పాలస్తీనా గ్రూప్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ఇరాన్, లెబనాన్, ఈజిప్ట్, సిరియా, జోర్డాన్‌తో సహా అనేక దేశాలకు విస్తరించిన ఈ ఉద్రిక్తతల కారణంగా ఇప్పటివరకూ 35,000 మందికి పైగా మరణించారు. దీంతో ఆయా దేశాలకు ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసుల్ని నిలిపేస్తున్నారు. ఇదే క్రమంలో ఎయిర్ ఇండియా కూడా ఆగస్టు 8 వరకూ ఇజ్రాయెల్ కు విమానాలు నిలిపేసింది. ఆ తర్వాత పరిస్ధితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications