సొంత గూటికి ఉగ్రమూక: ఆఫ్ఘన్ చేరుకున్న అల్-ఖైదా కీలక నేత: అమెరికా ఉలికిపాటు
కాబుల్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత.. రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. తాలిబన్ల పరిపాలనలో ఆ దేశం మళ్లీ ఉగ్రవాదులకు షెల్టర్ జోన్‌గా మారుతుందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్న వేళ.. ప్రపంచ దేశాలు ఊహించినట్టుగానే అక్కడి పరిస్థితులు నెలకొంటోన్నాయి. ఇప్పటికే వరుస పేలుళ్లు రాజధాని కాబుల్‌ను వణికించాయి. 160 మందికి పైగా ఈ ఆఫ్ఘనిస్తానీయులు ఈ పేలుళ్లకు బలి అయ్యారు.
అప్పటివరకు ఉనికిలో కూడా కనిపించకుండా పోయిన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఈ దాడులకు బాధ్యత వహించింది. మరిన్ని భయానక ఉగ్రదాడులు జరిగే ప్రమాదం లేకపోలేదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వ్యాఖ్యానించారంటే అక్కడి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఆత్మాహూతి దళ సభ్యులు ప్రయాణిస్తున్నట్టు భావించిన ఓ కారుపై అమెరికా డ్రోన్ల దాడి చేసింది. ఈ ఘటనలో వారంతా హతమయ్యారు. ఈ దాడి జరక్కపోయి ఉంటే- మానవబాంబులు మరింత పేట్రేగిపోయి ఉండేవారు.

ఈ పరిస్థితుల మధ్య ఉగ్రవాదులు మళ్లీ ఆప్ఘనిస్తాన్‌లో పాగా వేస్తోన్నారు. ఒకే గూటి కిందికి చేరుకుంటోన్నారు. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానాలతో దాడి చేసిన భయానక ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా కూడా దీనికి మినహాయింపు కాదు. ట్విన్ టవర్స్‌పై దాడికి ప్రతీకారంగా అమెరికా జరిపిన దాడులకు భయపడి, ఆప్ఘనిస్తాన్‌ను వదిలి వెళ్లిన ఉగ్రవాదులందరూ మళ్లీ స్వదేశానికి చేరుకుంటోన్నారు. తాజాగా అల్-ఖైదా కీలక నేత అమీనుల్ హక్.. ఆప్ఘనిస్తాన్‌లో అడుగు పెట్టారు.
తన సొంత రాష్ట్రం నంగర్‌హర్ ప్రావిన్స్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన కొద్దిరోజులకే ఆయన స్వస్థలానికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అల్-ఖైదా, తాలిబన్ల మధ్య ఉన్న సంబంధాలకు ఈ పరిణామం నిదర్శనంగా నిలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో అమీనుల్ హక్.. కాబుల్‌కు వెళ్తారని విదేశీ మీడియా అంచనా వేస్తోంది. తాలిబన్ల కీలక నేతలతో భేటీ అవుతారని అభిప్రాయపడుతోంది.
అమీనుల్ హక్.. ఒసామా బిన్ లాడెన్‌కు ముఖ్య అనుచరుడు. లాడెన్ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ కూడా. లాడెన్ ఎక్కడికి వెళ్లినా.. అతని వెంటే ఉండేవాడు. 2008లో అతణ్ని పాకిస్తాన్ భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. 2011లో విడుదల చేశారు. సుదీర్ఘకాలం పాటు తాలిబన్లతో కలిసి పనిచేసిన అనుభవం అమీనుల్ హక్‌కు ఉంది. ఇదివరకు తాలిబన్ల ప్రభుత్వం ప్రిసనర్ కమిషన్‌లో సైతం అతను పనిచేశాడు. ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా భద్రతా బలగాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో మట్టుబెట్టిన తరువాత.. తెరమరుగయ్యాడు.
అమెరికా సైన్యం అమీనుల్ హక్ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ జాడ దొరకలేదు. ఆ తరువాత మళ్లీ తెర మీదకి వచ్చాడు. తన స్వస్థలం నంగర్‌హర్ ప్రావిన్స్‌కు చేరుకున్నాడు. త్వరలోనే తాలిబన్లతో భేటీ కాబోతోన్నాడు. ఇదివరకట్లాగే- తాలిబన్ ప్రభుత్వంతో అసోసియేట్ అవుతాడనే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ చెలరేగిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆగ్నికి ఆజ్యం పోసినట్టు.. అల్-ఖైదా కూడా చాపకింద నీరులా తోడవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
Dr. Amin-ul-Haq, a major al-Qaeda player in Afghanistan, Osama Bin Laden security in charge in Tora Bora, returns to his native Nangarhar province after it fell to the Taliban. Dr. Amin became close to OBL in the 80s when he worked with Abdullah Azzam in Maktaba Akhidmat. pic.twitter.com/IXbZeJ0nZE
— BILAL SARWARY (@bsarwary) August 30, 2021
Recommended Video
ప్రపంచ దేశాలు అనుమానించినట్టే- ఉగ్రవాదులందరూ మళ్లీ తాలిబన్లతో జట్టు కట్టడానికి సిద్ధపడుతున్నారు. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోననే భయాందోళనలకు కారణమౌతున్నాయి. భారత్ సహా అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఒకింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందనే సంకేతాలను పంపించినట్టవుతోంది.












Click it and Unblock the Notifications