ఇజ్రాయెల్‌కు ఎందుకీ షాక్?: హఠాత్తుగా చేతులెత్తేసిన ట్రంప్ సర్కార్!
అమెరికా-ఇజ్రాయెల్ రక్షణ సంబంధాలలో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు ప్రతి ఏటా నిబంధనల ప్రకారం ఇస్తున్న బిలియన్ల కొద్దీ డాలర్ల సైనిక నిధులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఇప్పటికే సమాచారం అందించినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ఇజ్రాయెల్‌కు ఇక ఉచిత నిధులు అవసరం లేదు!
'ఫాక్స్ న్యూస్' ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు. ఇజ్రాయెల్ ఆర్థికంగా, సైనికపరంగా చాలా బలమైన దేశమని.. వారికి ఇక ఉచితంగా అమెరికా సైనిక సహాయం అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. భవిష్యత్తులో నిజంగా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తాము సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ అవసరం లేకపోయినా నిధులు ఇస్తూ పోవడంలో ఎలాంటి అర్థం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రతి ఏటా ఇజ్రాయెల్‌కు అందించే 4 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.33 వేల కోట్లు) వార్షిక సైనిక సహాయానికి సంబంధించిన ఒప్పందాన్ని తాము నిలిపివేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ వ్యూహం.. విమర్శలకు చెక్
ఈ నిర్ణయం వెనుక అమెరికాలో రాబోయే మధ్యంతర ఎన్నికల రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. డెమోక్రాట్లు, వామపక్ష నాయకులు అమెరికా ఇస్తున్న ఈ సైనిక నిధులపై సుదీర్ఘకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గాజా, పొరుగు ప్రాంతాల్లో దాడులకు ఇజ్రాయెల్ ఈ నిధులనే ఉపయోగిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ హఠాత్పరిణామంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.














Click it and Unblock the Notifications
