అమెరికాపై 9/11 తరహా దాడులు చేస్తాం.. ఇరాన్ సంచలన వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య పరస్పర దాడులు ఉద్ధృతంగా జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ లోని బ్రిడ్జ్ లు, విద్యుత్, అణు స్థావరాలపై దాడులు చేస్తామని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాంతో ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC) ట్రంప్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చింది. అమెరికాపై 9/11 తరహా దాడులు చేస్తామని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆ దాడులకు అమెరికా మొత్తం శోక సంద్రంలో మునిగిపోతుందని స్పష్టం చేసింది. అమెరికా- ఇరాన్ ఇలా వరుసగా వార్నింగ్ లు జారీ చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.
ఇరాన్ లోని స్టేట్ న్యూస్ ఏజెన్సీ అయిన తస్నిమ్ అందించిన సమాచారం ప్రకారం.. ట్రంప్ వార్నింగ్ కు IRGC స్పందిస్తూ.. ఒకవేళ యుద్ధం కొనసాగితే మీరు పశ్చాత్తాపం పడే విధంగా మా దాడులు ఉంటాయి. అమెరికా మొత్తం శోక సంద్రంలో మునిగిపోతుంది. అమెరికాపై 9/11 దాడులు చేస్తాం" అని స్పష్టం చేసింది.
గతంలో సెప్టెంబర్ 11 న అమెరికాలో అల్-ఖైదా ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. నాలుగు విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఏకంగా 3 వేల మందికిపైగా మృతి చెందారు. బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్- ఖైదా ఉగ్రవాద సంస్థ ఈ దాడులు నిర్వహించింది. ఆ సమయంలో అమెరికా మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. అయితే తాజాగా ఇరాన్ ఈ ఘటనను గుర్తు చేస్తూ అమెరికాలో ఇలాంటి దాడులు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది.

అంతకుముందు ఇరాన్ కు ట్రంప్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ సైన్యం దాడులకు పాల్పడితే అమెరికా తక్షణమే ఇరాన్ పై దాడులు చేస్తుందని అన్నారు. హార్మూజ్ లోని వాణిజ్య నౌకలపై జరిగే ఒక్కో దాడికి ప్రతీకారంగా ఇరాన్ లోని ఒక్కో న్యూక్లియర్ ప్లాంట్, బ్రిడ్జ్ లను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ను ఇప్పట్లో వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కు ఇరాన్ సైన్యం ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం తీవ్రస్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications