పసిఫిక్ మహా సముద్రంలో పెను భూకంపం- రెండో రోజూ- తీరం ఖాళీ..!!
పారిస్: పసిఫిక్ మహా సముద్రంలో మరో పెను భూకంపం సంభవించింది. తీర ప్రాంతాలను వణికించింది. సునామీ భయాలను పుట్టించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.1గా రికార్డయింది. ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న న్యూ కాలెడోనియా ద్వీపానికి తూర్పు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది.
పసిఫిక్ మహా సముద్రంలో ఈ స్థాయిలో భూకంపం సంభవించడం వరుసగా ఇది రెండో రోజు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం న్యూ కాలడోనియా సమీపంలో 7.7 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో సునామీ అలలు సైతం ఏర్పడ్డాయి. సాధారణ స్థాయి కంటే అడుగు ఎత్తు మేర అలలు ఎగిసిపడ్డాయి. పసిఫిక్ ద్వీప దేశాలు ఫిజి, కిరిబాతి, వనువాటు, వ్యాలీస్, ఫుటునాపై ప్రభావం చూపాయి.

సరిగ్గా 24 గంటల వ్యవధిలో ఇదే రీజియన్‌లో తాజాగా మరోసారి అసాధారణ తీవ్రతతో భూకంపం ఏర్పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. న్యూ కాలెడోనియాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యూఎస్‌జీఎస్ వెల్లడించింది. 22 కిలోమీటర్ల లోతులో ఫలకాల్లో చోటు చేసుకున్న తీవ్ర కదలికల వల్ల భూమి కంపించినట్లు వెల్లడించింది.
దీని తీవ్రతతో ఈశాన్యంలో తీర ప్రాంతాల్లో అలలు పోటెత్తాయి. తక్షణమే తీర ప్రాంతాలను ఖాళీ చేయాాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ భూకంప తీవ్రత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ కనపించింది. ఆస్ట్రేలియా తీర ప్రాంత నగరం బ్రిస్బేన్ వద్ద అలలు ఎగిసిపడ్డాయి. న్యూజిలాండ్‌లోని కూపర్స్ బీచ్‌ను కూడా అధికారులు ఖాళీ చేయించారు. న్యూజిలాండ్ సమీపంలో ఈ మధ్యకాలంలో ఏడుకు మించిన తీవ్రతతో భూకంపాలు సంభవిస్తోన్నాయని యూఎస్‌జీఎస్ తెలిపింది.












Click it and Unblock the Notifications