
వణికిస్తున్న మరో వింతవ్యాధి: సోకిందంటే రక్తపు వాంతులతో గంటలోనే మరణం, ఇప్పటికి 15మంది మృతి
ఒకపక్క కరోనా మహమ్మారి నుండి పూర్తిగా బయటపడక ముందే మరో మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. కరోనా వైరస్ ఉత్పరివర్తనం జరిగి కొత్త స్ట్రెయిన్స్ గా అటు యూకే , యూఎస్ , బ్రెజిల్ ను, దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేస్తున్న సమయంలో అంతుచిక్కని మరో వ్యాధి సోకిన గంట వ్యవధిలోనే ప్రాణాలను హరిస్తుంది. ఆఫ్రికా దేశం టాంజానియాలో కొత్తగా ప్రబలుతున్న ఈ వ్యాధి సోకిన గంటలోపే ప్రాణాలు తీస్తుంది.

దక్షిణ టాంజానియాలో వింత వ్యాధితో ఇప్పటివరకు పదిహేను మంది మృతి
అంతుచిక్కని వింత వ్యాధి కారణంగా దక్షిణ టాంజానియాలో ఇప్పటివరకు పదిహేను మంది మరణించారు .మరియు 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఈ వ్యాధి సోకిన వారు వికారంగా ఉండటం , రక్తపు వాంతులు చేసుకుని ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోగ్య అధికారులు చెప్తున్నారు. రోగులను వైద్యపరంగా అంచనా వేయడానికి మరియు వ్యాప్తికి గల కారణాలను పరిశోధించడానికి వైద్య నిపుణుల బృందాన్ని నియమించినట్లు ఎంబేయా నగరంలోని మారుమూల చున్యా జిల్లాలోని ముఖ్య వైద్య అధికారి ఫెలిస్టా కిసాండు తెలిపారు.

వ్యాధి సోకిన వారికి రక్తపు వాంతులు ... ఆలస్యం చేస్తే ప్రాణాలే హరి
ప్రస్తుతానికి ఈ వింత వ్యాధి విస్తృతంగా వ్యాపించలేదు, ఇఫంబో యొక్క ఒకే ఒక పరిపాలనా వార్డులో ఇది జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ప్రజలు రక్తాన్ని వాంతి చేసుకుంటున్నారని , ఆలస్యంగా ఆసుపత్రికి వచ్చినవారు చనిపోతున్నారని, ముందుగానే అనారోగ్యాన్ని గుర్తించి ఆసుపత్రికి వచ్చిన వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నామని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ అనారోగ్యానికి సంబంధించిన కారణం ఇంకా గుర్తించబడలేదని తెలుస్తుంది. అయితే ఇది బాగా వ్యాప్తి చెందలేదు అని చెప్తున్న టాంజానియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీని వ్యాప్తిని తోసిపుచ్చింది.

నీటిని, రక్త నమూనాలను పరిశీలిస్తున్న నిపుణులు.. బాధితులు ఎక్కువ పురుషులే
ప్రాధమిక క్లినికల్ పరీక్షలో రోగులు, ఎక్కువగా పురుషులేనని , వారు పలు జీర్ణ సంబంధమైన వ్యాధులు, కాలేయ వ్యాధి ఉన్నవారిని వెల్లడైందని ఆరోగ్య అధికారి కిసాండు చెప్పారు. ఇల్లీగల్ బ్రూ, సిగరెట్లు మరియు ఇతర హార్డ్ డ్రింక్స్ తాగకుండా ఉండాలని వారికి సలహా ఇచ్చామని వైద్యులు చెప్తున్నారు. అక్కడ త్రాగు నీటిలో పాదరసం కలుషితమైన ఆనవాళ్లు ఉన్నాయో లేదో నిర్ధారించడానికి వివిధ రకాల నీటి నమూనాలు మరియు రోగుల రక్తం ధృవీకరణ కోసం నిపుణులకు పంపబడిందని కిసాండు చెప్పారు.

నిపుణుల బృందాన్ని పంపిన టాంజానియా ఆరోగ్య మంత్రి , నివేదిక కు ఆదేశం
ఎంబేయా యొక్క చీఫ్ మెడికల్ ఆఫీస్ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం, 2018 లో ఇదే విధమైన వ్యాధి ఈ ప్రాంతంలో ప్రబలంగా ఉంది. చాలా మంది ప్రజలు అధిక జ్వరం, కడుపు నొప్పి మరియు వాంతులు రక్తంతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. టాంజానియా ఆరోగ్య మంత్రి డోరత్ గ్వాజిమా పరిస్థితిని అంచనా వేయడానికి నిపుణుల బృందాన్ని నియమించారు . తదుపరి చర్యల కోసం వ్యాధికి కారణాన్ని నిర్ధారిస్తూ వ్రాతపూర్వక నివేదికను సమర్పించాలని వారికి సూచించినట్లు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది.

కరోనా నుండి బయటపడక ముందే మరో కొత్త వ్యాధి భయం
ఏమి జరిగిందనే దానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని , ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి నుండి బయటపడక ముందే, కొత్తగా వ్యాపిస్తున్న ఈ వ్యాధి ఆందోళన కలిగిస్తుంది. ఇది వ్యాప్తి చెందే వ్యాధా కాదా అన్నది ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. ఇది కూడా కరోనా తరహా విస్తరించే వ్యాధి అయితే మానవ సమాజం డేంజర్ జోన్ లో పడినట్టే.