వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంకీపాక్స్ సోకకుండా వ్యాక్సీన్లు ఉన్నాయా... ప్రస్తుతం చికిత్సకు వాడుతున్న మందులేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మంకీపాక్స్ కు నిర్దిష్టమైన వ్యాక్సీన్‌లు లేవు

ఇంతకు ముందెప్పుడూ కనిపించని దేశాలలో కూడా ఈ ఏడాది మే నెల నుంచి మంకీపాక్స్ వైరస్ కనిపిస్తోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

ఆ సంస్థ చెప్పిన దాని ప్రకారం జూలై 23 నాటికి, 75 దేశాలలో 16,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా అయిదుగురు మరణించారు.

మశూచి (స్మాల్‌పాక్స్) లాగే మంకీపాక్స్ కూడా కుటుంబంలో ఒకరికి వస్తే మిగతా వారికి కూడా సోకే అవకాశం ఉంటుందని, అయితే అది వ్యాప్తి చెందే తీవ్రత చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు.

వ్యాధి లక్షణాలు ఉన్నవారిని వేరుగా ఉంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ లాంటి విధానాల ద్వారా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

టీకాలు ఉన్నాయా?

మంకీపాక్స్‌ వైరస్ ఇన్ఫెక్షన్లకు నిర్దిష్ట చికిత్సలు లేదా టీకాలు లేవు. మంకీపాక్స్, మశూచి వైరస్లు జన్యుపరంగా ఒకే లక్షణాలను కలిగి ఉన్నాయి కాబట్టి, మశూచిని అడ్డుకోవడానికి అనేక దేశాలు తయారు చేసిన యాంటీవ వైరల్ మెడిసిన్స్, వ్యాక్సీన్లనే దీనికి కూడా ఉపయోగిస్తున్నారు.

''ఈ వ్యాధి లక్షణాలకు ముందు తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకుంటే, మంకీపాక్స్ నుంచి ప్రజలను రక్షించడానికి మశూచి టీకాలు సమర్ధవంతంగా పని చేస్తాయి'' అని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెల్లడించింది.

అమెరికా, యూకే, యూరప్ సహా, మరికొన్ని దేశాలలో మంకీపాక్స్‌ను అరికట్టడానికి JYNNEOS అనే టీకాను వాడటానికి అనుమతి ఇచ్చారు. వాస్తవానికి ఈ టీకా 18 సంవత్సరాలు దాటిన వారిని మశూచి నుంచి కాపాడటానికి తయారు చేసింది.

మరో మంకీపాక్స్ వ్యాక్సీన్, ACAM2000 కూడా మశూచి కోసం తయారు చేసిన సెకండ్ జనరేషన్ వ్యాక్సీన్. దీన్ని వాడటానికి అమెరికాలో అనుమతించారు.

కానీ, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, అటోపిక్ డెర్మటైటిస్/తామర వంటి చర్మ వ్యాధులు, లేదా గర్భంతో ఉన్నవారు ఈ వ్యాక్సీన్ వాడరాదని సీడీసీ చెబుతోంది.

"ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్‌పై ఈ రెండు వ్యాక్సీన్‌లు ఎంత సమర్ధంగా పని చేస్తాయన్న దానిపై ఇంకా డేటా అందుబాటులో లేదు" అని సీడీసీ స్పష్టం చేసింది.

అయితే, ప్రస్తుతం JYNNEOS వ్యాక్సీన్ సరఫరా పరిమితంగా ఉంది. అనేక దేశాల్లో ఈ వ్యాధి సోకిన వారిలో అధిక రిస్క్ ఉన్న వారికి మాత్రమే దీన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే మశూచి వ్యాక్సీన్‌లు తీసుకున్నవారిలో కొంత రోగ నిరోధక శక్తి ఉండి ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే చాలా దేశాల్లో 40 ఏళ్ల కిందటే మశూచి నిర్మూలన అయినట్లు ప్రకటించడంతో దీని తయారీని నిలిపివేశారు.

టెకోవైరిమాట్ అనే యాంటీ వైరల్‌ను మందును చికిత్సకు వాడతున్నారు

చికిత్సలు

మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్లకు నిర్దిష్ట చికిత్సలు కూడా లేవు. యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) చెప్పినదాని ప్రకారం, ''ఈ వ్యాధి తేలికపాటిది. సోకిన వారిలో ఎక్కువ మంది చికిత్స లేకుండానే కొన్ని వారాల్లో కోలుకుంటారు"

అయితే, ఆసుపత్రిలో చేరాల్సిన హైరిస్క్ కేసులు కొన్ని ఉండొచ్చు. వృద్ధులు, చిన్నపిల్లలు, వారి రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే మందులు తీసుకునే వ్యక్తులకు ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు.

చికిత్స అవసరమయ్యే కేసులలో వ్యాక్సీన్‌లతోపాటు మశూచి నుంచి రక్షణ కోసం తయారు చేసిన యాంటీ వైరల్ ఔషధాలను మంకీపాక్స్ చికిత్స, నివారణలకు ఉపయోగించవచ్చని సీడీసీ వెల్లడించింది.

"టీకోవిరిమాట్ (TPOXX) వంటి యాంటీవైరల్‌ మందులు, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న రోగులు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు వాడవచ్చు'' అని సీడీసీ చెప్పింది.

"మీలో మంకీపాక్స్ లక్షణాలు ఉంటే, ఇంతకు ముందు మీరు మంకీపాక్స్ లక్షణాలున్నవారిని కలవలేదని అనుకున్నప్పటికీ, ఆరోగ్య నిపుణులను కలవడం మంచిది'' అని సీడీసీ సూచించింది.

మంకీపాక్స్ 75 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది

మంకీ పాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది?

మంకీ పాక్స్ పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని వర్షాధార అడవుల్లో కనిపిస్తోంది.

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ ఏడాదిలో 1200 కేసులు నమోదు కాగా, మే 01, 2022 నాటికి 57 మరణాలు చోటు చేసుకున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికాలోని వైరస్ ఇప్పటికే మనుగడలో ఉండగా, పశ్చిమ ఆఫ్రికాలోని తేలికపాటి వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది.

ఆఫ్రికా ప్రయాణం చేయని వారిలో కూడా మంకీ పాక్స్ కేసులు కనిపిస్తున్నాయి.

ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు సెక్స్ చేయవద్దని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చెబుతోంది. ఇన్ఫెక్షన్ తగ్గిన 8 వారాల తర్వాత కూడా ముందు జాగ్రత్త చర్యగా కండోమ్స్ వాడమని సూచిస్తోంది.

చాలా వరకు ఈ కేసులు చికెన్ పాక్స్ తరహాలో ఉండి కొన్ని వారాల తర్వాత క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నమోదు చేసిన మరణాలన్నీ ఆఫ్రికాలోనే చోటు చేసుకున్నాయి.

ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత లక్షణాలు కనిపించడానికి సాధారణంగా 5 - 21 రోజులు పడుతుంది. ముఖంపై మొదలై శరీరంలోని ఇతర భాగాలకు దద్దుర్లు వ్యాపిస్తాయి. ఎక్కువగా అరిచేతులు, పాదాల పై వస్తాయి.

ఈ దురద చాలా చికాకుగా, నొప్పితో కూడుకుని ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా 14-21 రోజుల్లో తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Are there any vaccines against monkeypox... What are the drugs currently used for treatment?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X