'విన్నింగ్ ఫార్ములా' కనుగొన్న ఆస్ట్రాజెనెకా... వైరస్ నుంచి 100 శాతం రక్షణ... ఆ విధానం సక్సెస్...
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 'కోవీషీల్డ్'కు సంబంధించి విన్నింగ్ ఫార్ములాను కనుగొన్నట్లు ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్కల్ సొరియట్ వెల్లడించారు. రెండు డోసుల విధానంతో వ్యాక్సిన్ 100శాతం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని అన్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన ఇటీవలి క్లినికల్ ట్రయల్స్‌లో ఫైజర్-95శాతం,బయో-ఎన్‌టెక్ 94.5శాతంతో సమానంగా ఆస్ట్రాజెనెకా ఫలితాలను చూపించిందన్నారు. రెండు డోసుల విధానానికి సంబంధించి ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించలేమని... త్వరలోనే సమగ్ర సమాచారాన్ని ప్రచురిస్తామని స్పష్టం చేశారు.
అప్పుడు 'గో కరోనా గో...' ఇప్పుడు కొత్త స్లోగన్ ఇచ్చిన కేంద్రమంత్రి రాందాస్ అథవాలే...

అత్యవసర వినియోగానికి దరఖాస్తు
ఇప్పటికే అత్యవసర వినియోగం కోసం ఆస్ట్రాజెనెకా బ్రిటన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి డేటాను రెగ్యులేటరీ ఏజెన్సీలకు సమర్పించింది. జనవరి 4వ తేదీన ఆస్ట్రాజెనెకాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చునన్న ప్రచారం కూడా జరుగుతోంది. బ్రిటీష్ ఛాన్సలర్ రిషి సునాక్ మాట్లాడుతూ... వ్యాక్సిన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలను ప్రశంసించారు. మున్ముందు మరింత గడ్డు కాలం ఉన్నప్పటికీ...వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటంతో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోందన్నారు.

గతంలో 70శాతం మాత్రమే...
నిజానికి గత నవంబర్‌లో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్‌లో తప్పులు దొర్లినట్లు స్వయంగా ఆ కంపెనీయే వెల్లడించింది. కొంతమందికి వలంటీర్లకు వ్యాక్సిన్ కేవలం సగం డోసు మాత్రమే ఇవ్వగా మరికొంతమందికి పూర్తి డోసు ఇచ్చినట్లు తెలిపింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని.. అనుకోకుండా జరిగిందని పేర్కొంది. ఇలా రెండు రకాల పద్దతుల కారణంగా వ్యాక్సిన్ సమర్థత 70శాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. కానీ ఆశ్చర్యంగా ఇదే రెండు పద్దతుల విధానం వ్యాక్సిన్ సమర్థతను పెంచినట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఏంటీ రెండు డోసుల విధానం...
ఆస్ట్రాజెనెకా రెండు డోసుల విధానం ప్రకారం... మొదటి డోసును సగం మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత నెల రోజులకు రెండో డోసును పూర్తి స్థాయిలో ఇస్తారు. ఈ విధానంతో తమ వ్యాక్సిన్ ఫైజర్,మోడెర్నాలతో సమానంగా ఫలితాలను కనబరుస్తోందని ఆ కంపెనీ చెబుతోంది. అనుకోకుండా జరిగిన తప్పిదాన్నే తమ విన్నింగ్ ఫార్ములాగా మలుచుకున్నామని అంటోంది. అయితే ఆస్ట్రాజెనెకా చెబుతున్న ఈ విధానంపై అనేక సందేహాలు,ప్రశ్నలు లేకపోలేదు. ఇవన్నీ నివృత్తి కావాలంటే ఆస్ట్రాజెనెకా తమ క్లినికల్ ట్రయల్స్‌పై పూర్తి డేటాను బయటపెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వానికి ఇప్పటికే పూర్తి డేటాను సమర్పించినట్లు ఆ కంపెనీ చెబుతోంది. త్వరలోనే తమకు అనుమతులు కూడా లభిస్తాయన్న ధీమాతో ఉంది. ఆలోగా ఆస్ట్రాజెనెకా రెండు డోసుల విధానంపై మరింత స్పష్టత రావొచ్చు.