తల్లి గర్భంలోనే శిశువు తల.. వైద్యసిబ్బంది నిర్వాకం; పాకిస్తాన్ లో హిందూమహిళ పట్ల దారుణం
పాకిస్తాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ నవజాతశిశువు మరణించడమే కాకుండా, సదరు గర్భిణీ స్త్రీ ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. పాకిస్థాన్ దేశంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే డెలివరీ కోసం వచ్చిన ఓ హిందూ గర్భిణీ స్త్రీ కి డెలివరీ చేయడానికి ప్రయత్నించిన అనుభవం లేని వైద్య సిబ్బంది నవజాత శిశువు యొక్క తలను కట్ చేసి తల్లి కడుపులోనే వదిలేశారు. తల్లి గర్భసంచిని కూడా చిద్రం చేశారు. దీంతో 32 ఏళ్ల మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

డెలివరీకి వెళ్ళిన మహిళకు తీరని నష్టం
తార్పార్కర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన భీల్ హిందూ మహిళ, డెలివరీ నొప్పులతో తమ ప్రాంతంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి (RHC) వెళ్ళింది. అయితే మహిళా గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో, అనుభవం లేని సిబ్బంది ఆమెకు డెలివరీ కోసం శస్త్రచికిత్స చేసి తీరని నష్టం చేశారు. జంషోరోలోని లియాఖత్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ (LUMHS) గైనకాలజీ విభాగానికి అధిపతిగా ఉన్న రహీల్ సికందర్ అక్కడ మహిళకు వైద్య సిబ్బంది చేసిన నష్టాన్ని వివరించారు.

నవజాత శిశువు తల కోసేసి కడుపులోనే వదిలేసిన వైనం
ఆదివారం నిర్వహించిన శస్త్రచికిత్సలో ఆర్‌హెచ్‌సి సిబ్బంది శస్త్రచికిత్సలో తల్లి కడుపులో ఉన్న నవజాత శిశువు తలను కోసేశారు. ఆపై శిశువు తలను లోపలే వదిలేసినట్లు ఆయన తెలిపారు. ఇక ఇది తల్లి ప్రాణాన్ని ప్రమాదంలో పడేసిందని ఆయన పేర్కొన్నారు. దీంతో వెంటనే ఆమెను వేరే ఆస్పత్రికి తరలించి గర్భంలో ఉన్న శిశువు తలను తొలగించి ఆమెను ప్రాణాపాయం నుండి కాపాడే ప్రయత్నం చేసినట్టు ఆయన వెల్లడించారు.

విచారణకు ఆదేశించిన సింధ్ ప్రభుత్వం
ఈ విషాదకరమైన ఘటనపై విచారణ చేయడానికి ప్రభుత్వం వైద్య విచారణ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ దారుణ ఘటనకు గల కారణాలను, తెలుసుకొని దోషులను శిక్షించడానికి ప్రయత్నిస్తామని వెల్లడించింది. ఇది భయంకరమైన తప్పిదం అని సింధ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జుమాన్ బహోటోను ఈ కేసుపై వేర్వేరు విచారణలకు ఆదేశించారు. ముఖ్యంగా చచ్రోలోని ఆర్‌హెచ్‌సీలో గైనకాలజిస్టు, మహిళా సిబ్బంది లేకపోవడంతో ఏం జరిగిందో విచారణ కమిటీలు తేలుస్తాయని చెప్పారు. ఇక ఈ మేరకు దర్యాప్తు మొదలైందని సమాచారం.