సుదీర్ఘకాలం పాటు పదవిలో: బహ్రెయిన్ ప్రధానమంత్రి కన్నుమూత: అమెరికాలో
అల్ మనామా: బహ్రెయిన్ ప్రధానమంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆయన అమెరికాలోని మాయో క్లినిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించిన విషయాన్ని బహ్రయిన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ధృవీకరించింది. మాయో క్లినిక్ ఆసుపత్రిలో షేక్ ఖలీఫా తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించింది. ఈ సమాచారం అందిన వెంటనే అధికారులు జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. గురువారం నుంచి మూడురోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.
ప్రపంచంలోనే సుదీర్ఘకాలం పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా షేక్ ఖలీఫా బిన్ సల్మాన్‌కు పేరుంది. నాలుగు దశాబ్దాలుగా ఆయన పదవిలో కొనసాగుతున్నారు. 1970లో ఆయన బహ్రెయిన్ ప్రధానమంత్రిగా నియమితులు అయ్యారు. ఇప్పటిదాకా ఆయనే ఆ పదవిలో ఉన్నారు. సల్మాన్ వంటి సమర్థుడైన నేతను కోల్పోవడం బాధాకరమని గల్ఫ్ కింగ్‌డమ్ రాజు షేక్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల్లో వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

సల్మాన్ పార్థివ దేహానికి అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించలేదని షేక్ హమద్ పేర్కొన్నారు. ఆయన పార్థికదేహం అమెరికా నుంచి రావాల్సి ఉందని, ఆ తరువాతే తేదీని నిర్ధారిస్తామని చెప్పారు. అంత్యక్రియలు అతి కొద్ది సమక్షంలో నిర్వహిస్తామని అన్నారు. ఆగస్టులో షేక్ ఖలీఫా అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఆయన అమెరికా పర్యటనను ప్రైవేటు కార్యక్రమంగా దీన్ని బహ్రెయిన్ అధికారులు అప్పట్లో వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయన కొంతకాలం పాటు జర్మనీలో చికిత్స పొందారు. మార్చిలో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆయన అనారోగ్య సమస్యలు తిరిగబెట్టడంతో ఆగస్టులో మళ్లీ అమెరికాకు వెళ్లారు.
Recommended Video
1793 నుంచే షేక్ ఖలీఫా కుటుంబం బహ్రెయిన్‌ను పరిపాలిస్తూ వచ్చింది. 1942 నుంచి 1961 వరకు బహ్రెయిన్‌ను పరిపాలించిన దివంగత షేక్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కుమారుడాయన. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని పొందిన అనంతరం ఆ దేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. పదవి నుంచి తప్పించాలంటూ 2011లో బహ్రెయిన్‌లో పెద్ద ఉద్యమమే నడిచింది. అరబ్ స్ప్రింగ్ ప్రొటెస్ట్‌ను అధిగమించారు. పదవిలో కొనసాగారు.












Click it and Unblock the Notifications