వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైడెన్‌-పుతిన్ ఫోన్ సంభాషణ: ఉక్రెయిన్‌పై ఆంక్షలు పెంచితే సమస్యలు తప్పవని హెచ్చరించిన రష్యా అధ్యక్షుడు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌ కారణంగా తమపై కొత్త ఆంక్షలు విధించడం వల్ల ఇరు దేశాల సంబంధాలు పూర్తిగా చెడిపోయే పరిస్థితులు తలెత్తుతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను హెచ్చరించారు.

గురువారం రాత్రి జో బైడెన్‌కి ఫోన్‌ చేసిన పుతిన్... ఇలాంటి ఆంక్షలు ఒక పెద్ద తప్పుగా పరిణమిస్తాయని అన్నారు.

russia US

ఉక్రెయిన్‌పై ఏ రకమైన దాడికైనా అమెరికాతో పాటు దాని మిత్రదేశాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయని బైడెన్ ఆయనకు బదులిచ్చారు.

ఈ నెలలో రష్యా, అమెరికా అధ్యక్షులు ఈ విషయంపై సంభాషించుకోవడం ఇది రెండోసారి. దాదాపు గంటపాటు గురువారం వీరిద్దరూ మాట్లాడుకున్నారు.

రష్యా- ఉక్రెయిన్ తూర్పు సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా తాజా ప్రయత్నంగా ఈ సంభాషణను పరిగణించవచ్చు. తమ సరిహద్దులో లక్షకు పైగా భద్రతా దళాలను రష్యా మోహరించిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు.

రష్యా చర్యతో పాశ్చాత్య దేశాల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ ఉక్రెయిన్‌పై దాడి జరిగితే... 'మీరెప్పుడూ చూడని విధంగా ఆంక్షలు విధిస్తామని' పుతిన్‌ను అమెరికా హెచ్చరించింది.

కానీ, తాము ఉక్రెయిన్‌పై దాడికి ప్రణాళికలు వేయట్లేదని రష్యా వెల్లడించింది. కసరత్తుల కోసమే తమ సైనికులు అక్కడికి వెళ్లారని స్పష్టం చేసింది. సొంతగడ్డపై ఎక్కడికైనా తమ భద్రతా బలగాలను తరలించే స్వేచ్ఛ తమకుందని రష్యా ఉద్ఘాటించింది.

ఫోన్‌కాల్ సందర్భంగా ఇరు వర్గాలు పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకున్నప్పటికీ... రష్యా విదేశాంగ విధాన సలహాదారు యురీ ఉషాకోవ్ మాట్లాడుతూ 'బైడెన్‌తో చర్చించాక పుతిన్ సంతోషంగా ఉన్నారని' అన్నారు. భవిష్యత్ చర్చల కోసం తాజా సంభాషణ మంచి పునాదిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఈ సందిగ్ధ పరిస్థితి గురించి మాట్లాడిన అమెరికా సీనియర్ అధికారి ఒకరు 'సంభాషణ... గంభీరంగా, సీరియస్‌గా, వాస్తవిక దృక్పథంతో జరిగిందని' చెప్పారు.

''ఈ చర్చల్లోని వాస్తవిక పురోగతి, కేవలం వివాద పరిస్థితుల తీవ్రతను తగ్గించే వాతావరణంలో మాత్రమే జరుగుతుందని అధ్యక్షుడు బైడెన్ పునరుద్ఘాటించినట్లు'' వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ చెప్పారు.

''ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే, యునైటెడ్ స్టేట్స్‌తో పాటు దాని మిత్ర దేశాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయని బైడెన్ స్పష్టం చేసినట్లు'' ఆమె తెలిపారు.

వచ్చే నెలలో జెనీవా వేదికగా వ్యక్తిగత చర్చల కోసం అమెరికా, రష్యా అధికారులు సమావేశం కానున్నారు. 'దౌత్యపరమైన పరిష్కారాన్ని అన్వేషించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను బైడెన్ కోరినట్లు' వైట్ హౌస్ తెలిపింది.

గురువారం ఫోన్‌కాల్ కంటే ముందు హాలీడే సందేశంలో బైడెన్‌తో మాట్లాడుతూ పుతిన్... 'పరస్పర గౌరవం, ఇరు దేశాల జాతీయ ప్రయోజనాల ఆధారంగా తమ జోడీ కలిసి పనిచేయడానికి తాను ఒప్పుకుంటున్నట్లు'' తెలిపారు.

'మాస్కో, తాపీగా చర్చలు జరిపే మూడ్‌లో ఉందని' పుతిన్ అధికార ప్రతినిధి డివిత్రీ పెస్కోవ్ చెప్పారు.

''మా మధ్య విస్తృతంగా ఉన్న అన్ని సమస్యలను, చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించడం సాధ్యమవుతుందని మేం నమ్ముతున్నాం'' అని పెస్కోవ్ చెప్పారు.

వాషింగ్టన్‌లో తీవ్ర ఆందోళన

తారా మెకెల్వీ, బీబీసీ వైట్‌హౌస్ రిపోర్టర్ విశ్లేషణ

ఉక్రెయిన్ గురించి మాట్లాడేటప్పుడు వైట్‌హౌస్ అధికారులు ప్రశాంతంగా ఉంటారు. వెస్ట్ వింగ్ వెలుపల మాట్లాడుతున్నప్పుడు ఇలా కనబడుతుంటారు.

గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన సంభాషణ 'తీవ్రమైన, ముఖ్యమైన సంభాషణ' అని వైట్‌హౌస్ పరిపాలక సీనియర్ అధికారి, విలేఖరులతో చెప్పారు.

వారిద్దరి మధ్య చర్చల గురించి ఆ అధికారి పరిమితంగానే మాట్లాడారు. కానీ రష్యా వల్ల పొంచి ఉన్న ప్రమాదం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఆయన కోపంగా కనిపించారు. మీదకు బాగానే కనబడుతున్నప్పటికీ, ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసే అవకాశం గురించి వైట్‌హౌస్ వర్గాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.

'రష్యా నుంచి వస్తోన్న సంకేతాలు అశుభ సూచకాలు. కాబట్టి దౌత్యపర అంశాల్లో వేగం పెరిగింది' అని వైట్‌హౌస్‌లోని ఒక వ్యక్తి నాతో చెప్పారు.

గురువారం ఇద్దరు నాయకులు మాట్లాడుకోవడం వైట్‌హౌస్‌లోని వారికి సానుకూల సంకేతంగా కనిపించింది.

''సరిహద్దుల్లో లక్షల సంఖ్యలో భద్రతా బలగాలను రష్యా మోహరించిందని, జనవరి చివరి నాటికి పెద్ద ఎత్తున సైనిక దాడికి పాల్పడేలా సిద్ధమవుతోందని'' డిసెంబర్ నెల ప్రారంభంలో పార్లమెంట్ వేదికగా ఉక్రెయిన్ రక్షణ మంత్రి చెప్పారు.

పశ్చిమ సైనిక కూటమి అయిన 'నాటో'కు వ్యతిరేకంగా సైనిక శక్తిని ప్రదర్శించే వ్యూహంలో భాగంగానే సరిహద్దుల్లో సైనిక బలగాలను మోహరించినట్లు రష్యా చెబుతోంది. ఉక్రెయిన్‌ వైపుకు నాటో విస్తరించకూడదని, ఇతర పొరుగు దేశాలతో పాటు ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు అందించవద్దని, ఈ అంశాల్లో చట్టబద్ధమైన హామీ కావాలని రష్యా కోరుకుంటోంది.

స్వతంత్ర దేశాల భవిష్యత్‌ను నియంత్రించడానికి 'క్రెమ్లిన్ బిడ్'‌గా భావిస్తోన్న ఈ అంశాన్ని అమెరికా తిరస్కరించింది.

ఉక్రెయిన్‌కు ఇంకా నాటోలో సభ్యత్వం దక్కలేదు. కానీ కూటమితో సన్నిహిత సంబంధాలను ఉక్రెయిన్ కలిగి ఉంది.

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఇది కొత్తేమీ కాదు. 2014లో రష్యా, ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత తూర్పు వేర్పాటువాదులకు అండగా నిలిచింది. ఆ సమయంలో జరిగిన పోరాటంలో 14,000 మంది మరణించారు.

ఉక్రెయిన్‌ భూభాగంలోకి మళ్లీ రష్యా ప్రవేశించినట్లయితే తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని వాషింగ్టన్‌తో పాటు దాని యూరోపియన్ మిత్ర దేశాలు రష్యాను హెచ్చరించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Biden-Putin phone conversation: Russian president warns of escalation of sanctions on Ukraine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X