అవును, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చాం, పెంచి పోషించాం- భుట్టో ప్రకటన
Bilawal Bhutto: పహల్గామ్‌లో ఉగ్రవాదుల ఘాతుకం తరువాత పాకిస్తాన్ మరింత రెచ్చిపోతోంది. భారత్‌పై బురదజల్లే ప్రయత్నాలకు తెర తీసింది. ఎదురుదాడికి దిగుతోంది. అంతర్జాతీయ వేదికలపైనా భారత్‌ను బద్నాం చేయడానికి శతవిధాలా శ్రమిస్తోంది గానీ అవేవీ ఫలించట్లేదు.
దీనితో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరింత బరితెగించారు. తన కడుపుమంటను బయటపెట్టుకున్నారు. భారతే స్వయంగా ఉగ్రవాదాన్ని పోషిస్తోందంటూ బట్ట కాల్చి ముఖం వేశారు. ఒకదశలో చొరబాట్లనూ సమర్థించుకున్నారాయన. సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తమ బలగాలను బలోపేతం చేశామని, కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోదలచుకున్నామని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. తమపై భారత్ దాడికి పాల్పడే అవకాశం ఉన్నందున ఆ దేశాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చొరబాటు ఆసన్నమైందని తాను ఎందుకు భావిస్తున్నానో మరిన్ని వివరాలలోకి వెళ్లలేదని ఆయన అన్నారు.
పహల్గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు ఇద్దరు పాకిస్తాన్‌కు చెందినవారని భారత్ చెప్పడాన్ని ఖవాజా తప్పు పట్టారు ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్ ఇలాంటి ప్రకటనలను చేయడం సరికాదని అన్నారు. దీన్ని తమ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారని, తటస్థ దర్యాప్తుకు పిలుపునిచ్చిన విషయాన్ని ఆసిఫ్ గుర్తు చేశారు.
ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నాయకుడు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఇదేరకంగా మాట్లాడారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు కూడా.
ఒకప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిందని, వారిని పెంచి పోషించిందని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. దాని వల్ల సంభవించిన దుష్పరిణామాలను చవి చూశామని, ఫలితంగా దేశం ఎంతో నష్టపోయిందని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన గతం పాకిస్తాన్‌కు ఉందనేది బహిరంగ రహస్యమని చెప్పారు.
దాని వల్ల తీవ్రంగా నష్టపోయామని, ఆ తరువాత ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, దాదాపుగా నిర్మూలించగలిగామని బిలావల్ భుట్టో వివరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల కొన్ని పాఠాలు కూడా నేర్చుకున్నామని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అంతర్గతంగా సంస్కరణలను చేపట్టామని, అంతర్జాతీయ సమాజానికి కూడా మార్గదర్శనం చేశామని అన్నారు.












Click it and Unblock the Notifications