Omicronపై అతిగా స్పందించొద్దు: ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్
జెనీవా: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఓమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త కరోనా వేరియంట్ 20కిపైగా దేశాల్లో వ్యాప్తి చెందింది. ఈ క్రమంలో అనేక దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాలు విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికాకు రాకపోకలను నిలిపివేస్తున్నాయి. దీంతో తమను ఇలా శిక్షించడం సరికాదని దక్షిణాఫ్రికా ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయేసస్ స్పందించారు. ఓమిక్రాన్ వ్యాప్తిపై అతిగా స్పందించవద్దని ప్రపంచ దేశాలకు సూచించారు. కఠిన ఆంక్షలు అవసరం లేదన్నారు. తమ ప్రజలను కాపాడుకోవాలని దేశాలు భావించడాన్ని తాము అర్థం చేసుకోకున్నామని, కానీ, ఒమిక్రాన్ వేరియంట్ పై తమకింకా పూర్తి అవగాహన రాలేదని చెప్పారు.

కొత్త వేరియంట్ తీవ్రత ఎంత? ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్లు ఓమిక్రాన్ ను సమర్థంగా ఎదుర్కోగలవా? అనే ప్రశ్నలకు సమాధానం అన్వేషించాల్సి ఉందని టెడ్రోస్ తెలిపారు. ఓమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా.. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. అయినా అప్పుడే కొన్ని దేశాలు వైరస్ కట్టడికి అనవసరంగా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయని, వీటి వల్ల వైరస్ ను నియంత్రించలేమని అన్నారు. పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, పరిస్థితులు మరింతగా దిగజారుతాయని టెడ్రోస్ అథనామ్ వ్యాఖ్యానించారు.
ఓమిక్రాన్ వేరియంట్ గురించి పూర్తిగా తెలియక ముందే దక్షిణాఫ్రికాపై ఆంక్షలు విధించవద్దని టెడ్రోస్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ పై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న దక్షిణాఫ్రికా, బోట్సావానా దేశాలకు టెడ్రోస్ కృతజ్ఞతలు తెలిపారు. సరైన పనిచేస్తున్నందుకు ఆ దేశాలను ఇతర దేశాలు శిక్షిస్తుండటం సరికాదని అన్నారు. ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. డెల్టా కంటే తీవ్రత తక్కువగానే ఉందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications