వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రెయిన్ ఫాగ్: మెనోపాజ్‌కు ముందు మతిమరుపు ఎందుకొస్తుంది, తర్వాత ఏం జరుగుతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బ్రెయిన్ ఫాగ్

న్యూయార్క్ లెనాక్స్ హిల్ ఆస్పత్రిలోని న్యూరాలజిస్ట్ గాయత్రి దేవి, ఆమె సహచరులు తమ కెరియర్ ప్రారంభంలో ఒక పొరపాటు చేశారు.

మెనోపాజ్‌ దశలో ఉన్న ఒక మహిళను వారు అల్జీమర్ రోగిగా భావించారు.

ఎన్నో చికిత్సల తర్వాత ఆ మహిళ ఆరోగ్యం మెరుగుపడింది. కానీ మెనోపాజ్ ప్రారంభ లక్షణాలైన మతిమరుపు, ధ్యాస లేకపోవడం లాంటి లక్షణాల వెనుక వేరే కారణం ఉందని డాక్టర్ గాయత్రి దేవి గుర్తించారు.

ఈస్ట్రోజన్(స్త్రీ హార్మోన్) స్థాయి భారీగా పడిపోవడం వల్ల ఆమె మెదడుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్నారు. మెనోపాజ్ దశకు వచ్చే ముందు మహిళల హార్మోన్లలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి.

బ్రెయిన్ ఫాగ్

చాలా మందిలో కనిపిస్తుంది కానీ దానికి కారణం ఏమిటో వారికి తెలియదు

ఒక మహిళకు చివరి పీరియడ్ వచ్చిన ఏడాది తర్వాత మెనోపాజ్‌ ప్రారంభమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

మెనోపాజ్‌కు సంబంధించిన ఒక లక్షణం గురించి రీసెర్చ్ చేసేలా డాక్టర్ గాయత్రి దేవికి ఆ రోగి ఘటన ప్రేరణ కలిగించింది.

ఆ లక్షణం పేరు 'బ్రెయిన్ ఫాగ్'. బ్రెయిన్ ఫాగ్(మెంటల్ ఫాగ్ అని కూడా అంటారు) గురించి అత్యంత షాక్ ఇచ్చే విషయం ఏంటంటే.. చాలా మంది మహిళలు దీనికి బాధితులైనా, దానికి కారణం ఏంటో వారికి తెలీదు.

జ్ఞాపకశక్తిపై ప్రభావం

బ్రెయిన్ ఫాగ్ గురించి డాక్టర్ గాయత్రి బీబీసీతో మాట్లాడారు.

"చాలా మంది మహిళలకు ప్రీ-మెనోపాజ్(మెనోపాజ్‌కు దగ్గరగా ఉండడం, ఇది దాదాపు ఏడేళ్ల వరకు ఉండచ్చు) సమయంలో మతిమరుపు, ఒకేసారి చాలా పనులపై దృష్టి పెట్టలేకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. మహిళలు తరచూ బాగా మాట్లాడగలిగినా, ఇలాంటి వారు మాట్లాడ్డంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు" అని అన్నారు.

షికాగో, ఇలినాయిస్ యూనివర్సిటీలో సైకాలజీ, గైనకాలజీ ప్రొఫెసర్, అమెరికన్ మెనోపాజ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు పాలీన్ మాకీ కూడా దీని గురించి చెప్పారు.

"ఇది మహిళల జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అంటే వారు "మేం స్టోర్‌కు వెళ్లాం. ఏం తీసుకెళ్లాలో గుర్తు చేసుకోవాలని ప్రయత్నించాం" అని చెబుతుంటారు అని అన్నారు.

దీనితోపాటూ కథలు చెప్పడం లేదా చర్చల్లో పాల్గొనడం, గుర్తు పెట్టుకునే మన సామర్థ్యంపై కూడా బ్రెయిన్ ఫాగ్ ప్రభావం చూపిస్తుంది.

https://www.facebook.com/watch/?v=283349543537931

సమస్య విస్తృతం, కానీ దీనిపై దృష్టి పెట్టడం లేదు

"మా అధ్యయనంలో మాకు వైద్యపరంగా చాలా గణనీయమైన తేడాలు కనిపించాయి. 10 శాతం మహిళల స్కోర్ వారి వయసుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. కానీ, చాలా మంది మహిళల్లో వారి పనిపై ప్రభావం చూపించని చిన్న సమస్యలు కనిపించాయి. వారిలో కూడా వ్యత్యాసం కనిపిస్తోంది" అని ప్రొఫెసర్ పాలీన్ మాకీ అన్నారు.

"ప్రీ-మెనోపాజ్ లేదా మెనోపాజ్‌ దశలో ఉన్న దాదాపు 60శాతం మహిళలకు చాలా మార్పుల గురించి తెలుస్తుంది. కానీ వాటన్నిటికీ చికిత్స అందించలేం" అని డాక్టర్ గాయత్రి చెప్పారు.

బ్రెయిన్ ఫాగ్

ఈస్ట్రోజన్ తగ్గిపోవడం

దీనికి కారణమైన ఒక పెద్ద సమస్య ఏంటంటే మెదడులో ఈస్ట్రోజన్ రిసెప్టర్స్‌లో చాలావరకు హిప్పోకాంపస్‌లో ఉంటాయి. అంటే మెదడులో మెమొరీని ఎలాగోలా సరి చేయడం లేదా తిరిగి తీసుకురావడం లాంటి భాగాల్లో ఉంటాయి.

"ఈస్ట్రోజన్ హఠాత్తుగా తగ్గిపోయినపుడు, హిప్పోకాంపస్‌లోని కొన్ని కార్యకలాపాలు ప్రభావితం అవుతాయి" అని డాక్టర్ గాయత్రి చెప్పారు.

అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో అండాశయం (అత్యధికంగా ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది) తొలగించిన వారికి, ఈస్ట్రోజన్ మోతాదు ఇవ్వడం వల్ల ప్రయోజనం కనిపించిందని ప్రొఫెసర్ మాకీ చెప్పారు.

కానీ ప్రీ-మెనోపాజ్ దశలో ఉన్న మహిళలందరి పైనా మెంటల్ ఫాగ్‌ ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈస్ట్రోజెన్ ప్రభావం ఒక్కో మహిళ మీదా వేరు వేరుగా ఉంటుంది.

19వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ వైద్యుడు ఎడ్వర్డ్ టిల్ట్ మెంటల్ ఫాగ్ అనే మాట ఉపయోగించారు. ఆయన మెనోపాజ్‌లో ఉన్న విక్టోరియా రోగుల్లో ఏర్పడిన ఫాగింగ్ స్థితి గురించి చెప్పేవారు. అంటే వాళ్లు తమ పర్స్ ఎక్కడ పెట్టారు, ఇంటికి తిరిగి ఎలా వెళ్లాలి లాంటివి మర్చిపోయేవారని తెలిపారు.

బ్రెయిన్ ఫాగ్

చెమట పట్టడం, మతిమరుపు

"కానీ ఈస్ట్రోజెన్ ఒక్కటే దీనికి ప్రధాన కారణం కాదు. సరిగా నిద్రలేకపోవడం లాంటి మిగతా చాలా కారణాలు కూడా ఉన్నాయి. మెనోపాజ్‌ దశలో ఉన్న 60 శాతం మంది మహిళలు నిద్రకు సంబంధించి సమస్య ఉందని చెప్పారు. నిద్రకు జ్ఞాపకశక్తితో కనెక్షన్ ఉంది" అని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో సైకోథెరపీ ప్రొఫెసర్ రెబెక్కా థర్‌స్టన్ అన్నారు.

నిద్రలేమి మెమొరీ సర్క్యూట్‌పై ప్రభావం చూపుతుంది. చాలా వేగంగా చెమటలు పట్టడానికి కూడా ఇదే కారణం. హఠాత్తుగా శరీరమంతా ఎక్కువ వేడి వ్యాపిస్తుంది. దానివల్ల చర్మం ఎర్రబడుతుంది. చెమటలు పడతాయి.

నిద్రపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు విపరీతంగా చెమటలు పట్టడం కూడా ఒక సమస్యే.

కొంతమంది మహిళలు చెమటలు పట్టడంతో అర్ధరాత్రి మెలకువ వచ్చిందని చెబుతారు. మరికొంతమంది మహిళలకు చెమటలు పట్టడం వల్ల తడిచిన వారి దుస్తులతోపాటూ, బెడ్‌షీట్లు కూడా మార్చుకోవాల్సి వస్తుంది.

"మహిళలకు చెమటలు పట్టడాన్ని మేం ఒక చిన్న లక్షణంగా భావిస్తున్నాం. కానీ ఇది గుండె వ్యాధులు వచ్చే ముప్పు పెంచుతుంది. దానివల్ల మెదడు వ్యాధులు రావచ్చు. అలా హిప్పోకాంపస్ రెండు వైపులా కనెక్షన్లపై ప్రభావం పడి, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది" అని ప్రొఫెసర్ థర్‌స్టన్ అన్నారు.

మూడ్ స్వింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ప్రీ-మెనోపాజ్ దశలో పెరుగుతాయి. ఇవి జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపిస్తాయి.

బ్రెయిన్ ఫాగ్

అవగాహన లోపం

ఈ లక్షణాలు ఇంత విస్తృతంగా కనిపిస్తుంటే, దీనిపై ఎందుకు మాట్లాడ్డం లేదు.

దీనికి కారణం అవగాహనా లోపం అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే చాలా సంస్కృతుల్లో మెనోపాజ్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడ్డం ఉండదు.

"విషయం ఏంటంటే, ఈ సమస్యలు చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి. కానీ, తాము ప్రీ-మెనోపాజ్ దశలో ఉన్నామనేది మహిళలకు తెలీదు. అందుకే ఈ లక్షణాలకు వేరేవాటిని కారణాలుగా చూపించడం సులభమైపోతోంది" అని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వోకీలో సైకాలజీ ప్రొఫెసర్ కరన్ ఫ్రిక్ అన్నారు.

మెనోపాజ్ లక్షణాలు

  • పీరియడ్ కాల వ్యవధిలో మార్పులు
  • పీరియడ్ ఫ్లోలో మార్పు(వేగంగా లేక నెమ్మదిగా)
  • యోని పొడిబారడం
  • నిద్ర సమస్యలు
  • ఆందోళన
  • కీళ్ల నొప్పులు
  • మూడ్ స్వింగ్
  • బరువు తగ్గడం
  • మూత్రాశయ మార్గంలో ఇన్ఫెక్షన్

ఆధారం: బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్

40-50 ఏళ్ల మధ్య మహిళలు చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగం లేదా ఇల్లు చూసుకోవడంలో తీరిక లేకుండా ఉంటారు. వివిధ వయసుల పిల్లలతోపాటూ వారు తమ తల్లిదండ్రుల్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఇవన్నీ.. తమ ఒత్తిడికి కారణం అని వారు భావించేవారు" ప్రొఫెసర్ ఫ్రిక్ చెప్పారు.

"మరోవైపు వివిధ వృత్తుల్లోని మహిళలు ఈ సమస్యల గురించి మాట్లాడ్డానికి కూడా భయపడతారు. మహిళలు కెరియర్‌లో ఏదైనా సాధించాలని చాలా కష్టపడతారు. వయసు పెరిగినట్లు, బలహీనంగా కనిపించాలని వాళ్లు అసలు కోరుకోరు" అన్నారు.

మెనోపాజ్ దానివల్ల మెదడుపై పడే ప్రభావం గురించి మెరుగైన అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందని దీనిపై బీబీసీతో మాట్లాడిన డాక్టర్లందరూ ఏకీభవించారు.

ముఖ్యంగా దీనిపై అవగాహన కల్పించాలని, అప్పుడైనా లక్షలాది మహిళలకు ఈ అనవసరమైన బాధల నుంచి కాపాడగలమని చెబుతున్నారు.

బ్రెయిన్ ఫాగ్

చికిత్స ఎలా

"మొదట గమనించాల్సింది.. మహిళలు ఆందోళనకు గురవకూడదు. ఎందుకంటే ఇది అల్జీమర్ అయ్యుంటుందని వాళ్లకు అనిపిస్తుంది. దానికి అవకాశాలు తక్కువ" అని ప్రొఫెసర్ మాకీ చెప్పారు.

"ఈ అంశంపై ఎన్నో అధ్యయనాలు జరిగాయి. వీటి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కానీ వాటిని బట్టి మెంటల్ ఫాగింగ్ అనేది తాత్కాలికమని, అది తగ్గిపోతుందని సంకేతాలు లభించాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ తక్కువగా ఉండడం లేదా లేకపోవడం అనేది మెదడుకు అలవాటైపోతుంది" అన్నారు.

కానీ విపరీతంగా చెమటలు పట్టడం వల్ల ఎవరైనా రాత్రంతా మేల్కోవాల్సి వస్తుంటే, డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్లో ముఖ్యంగా యువతులకు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ కూడా ఇస్తారు. దానివల్ల ప్రమాదాల కంటే ప్రయోజనాలే ఎక్కువ.

చాలా మంది మహిళలు ఈ థెరపీకి బాగా స్పందిస్తున్నట్లు డాక్టర్ గాయత్రి చెప్పారు.

"దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఒక వివాదాస్పద అధ్యయనం ప్రచురితం కావడంతో ఈ థెరపీని ఉపయోగించడం చాలా తగ్గిపోయింది. ఆ అధ్యయనంలో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పారు. తర్వాత దానిని సవాలు చేశారు" అని తెలిపారు.

ఆధునిక హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీపై ఇంతకు ముందుకంటే ఎక్కువగా దృష్టిపెట్టారు. ఈస్ట్రోజన్‌ చాలా రకాలుగా ఉంటుంది. చాలా కేసుల్లో వాటివల్ల ప్రయోజనం కూడా కలగవచ్చు అన్నారు.

తేలికపాటి లక్షణాలు ఉండి, హార్మోన్ థెరపీ తీసుకోకూడదని అనుకునే మహిళలకు కాగ్నెటివ్ పెర్ఫామెన్స్‌ను మెరుగుపరచడానికి సాయం చేసేవి చాలా ఉన్నాయి.

ఏరోబిక్స్ ఎక్సర్‌సైజ్, క్రీడలు లేదా మానసిక ఎక్సర్‌సైజ్, బాగా నిద్రపోవడం, మద్యం తాగడం తగ్గించడం, బాగా తినడం ఇలాంటివన్నీ మెనోపాజ్ వల్ల ఉత్పన్నమయ్యే లక్షణాలను తగ్గించడానికి సాయం చేస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Brain Fog: Why does forgetfulness occur before menopause and what happens after
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X