బుర్కినా ఫాసోలో ఉగ్రవాదుల మారణహోమం-100మంది బలి-రాత్రికి రాత్రే ఆ గ్రామంపై విరుచుకుపడి
పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో సాయుధ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. నార్త్ బుర్కినా ఫాసోలోని సోల్హన్ అనే గ్రామంపై రాత్రికి రాత్రి విరుచుకుపడి 100 మందిని పొట్టనబెట్టుకున్నారు. బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ కబొర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మారణహోమంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశంలో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
గడిచిన కొన్నేళ్లలో బుర్కినా ఫాసోలో ఇదే అత్యంత ఘోరమైన దాడిగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. సోల్హన్ గ్రామంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఇళ్లు,మార్కెట్లకు నిప్పు పెట్టినట్లు తెలిపింది. దాడికి పాల్పడినవారు కచ్చితంగా ఉగ్రవాదులేనని తెలిపింది.

దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం అక్కడి భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటికైతే ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. గత ఏడాది కాలంగా బుర్కినా ఫాసో-నైగర్,మాలి సరిహద్దు గ్రామాల్లో ఇస్లామిక్ తీవ్ర వాద కార్యకలాపాలు,దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడింది ఆ ఉగ్రవాద సంస్థలేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఈ ఏడాది మే నెలలో బుర్కినా ఫాసో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏరివేత ఆపరేషన్‌ను చేపట్టింది.దాదాపు 5వేల మంది ఫ్రెంచ్ సైన్యం సైతం బుర్కినా ఫాసో బలగాలకు మద్దతుగా రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునేందుకు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు.
Recommended Video
సోల్హన్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన రోజే(జూన్ 4) అక్కడికి 150కి.మీ దూరంలోని తదర్యత్ అనే మరో గ్రామంలోనూ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 14 మంది చనిపోయారు. ఉగ్రదాడులతో గత కొన్నేళ్లుగా బుర్కినా ఫాసో అల్లకల్లోలంగా మారింది. ఈ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే 14లక్షల పైచిలుకు మంది ఆ దేశాన్ని వీడారు. సరిహద్దు దేశమైన నైగర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేస్తే తప్ప బుర్కినా ఫాసోలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనిపించట్లేదు. సోల్హన్ మారణహోమం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications