అమెరికాలో భారతీయ విద్యార్ధులకు కేంద్రం కీలక సూచన..!
అమెరికాలో భారతీయ విద్యార్ధులకు కేంద్రం కీలక సూచన చేసింది. తాజాగా అక్కడ చోటు చేసుకున్న రెండు ఘటనల్ని గుర్తుచేస్తూ విద్యార్ధులు ఇకపై ఎలా వ్యవహరించాలో సూచించింది. ఆ రెండు ఘటనల్లోనూ భారతీయ విద్యార్ధులు తమను సంప్రదించలేదని కేంద్రం వెల్లడించింది. అయితే ప్రస్తుతం ట్రంప్ సర్కార్ వలసదారులపై ఉరుముతున్న నేపథ్యంలో కేంద్రం విద్యార్ధులకు చేసిన సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికాలో తాజాగా ఇద్దరు భారతీయ విద్యార్ధులు హమాస్, పాలస్తీనాకు సంఘీభావం తెలిపి ఇబ్బందుల్లో పడ్డారు. వీరిలో జార్జిటౌన్ యూనివర్శిటీలో ఫెలోషిప్ చేస్తున్న బదర్ ఖాన్ సూరి, కొలంబియా యూనివర్శిటీ విద్యార్ధిని రజనీ శ్రీనివాసన్ ఉన్నారు. ఇందులో బదర్ ఖాన్ సూరి హమాస్ అనుకూల ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే రజనీ శ్రీనివాసన్ పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో వీరిద్దరినీ తీవ్రవాద సానుభూతిపరులుగా అక్కడి ప్రభుత్వం పరిగణించింది. దీంతో సూరిని యూనివర్శిటీ నుంచి పంపేశారు. అలాగే రజనీ తనంతట తానే కెనడా వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వీరిద్దరూ తమ రాయబార కార్యాలయాన్ని సంప్రదించలేదని తెలిపింది.
వీసా, ఇమ్మిగ్రేషన్ విషయాలు ఒక దేశం యొక్క సార్వభౌమ విధుల్లో భాగంగా ఉన్నాయని, అటువంటి అంతర్గత విషయాలను నిర్ణయించే హక్కు అమెరికాకు ఉందని తెలిపింది. విదేశీ పౌరులు భారతదేశానికి వచ్చినప్పుడు, వారు మన చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటారని, అలాగే భారతీయ పౌరులు విదేశాలలో ఉన్నప్పుడు, వారు స్థానిక చట్టాలు మరియు నిబంధనలను కూడా పాటించాలని సూచించింది. అయితే విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే అమెరికాలోని భారత కాన్సులేట్‌లు, రాయబార కార్యాలయాలు వారికి సహాయం చేస్తాయని హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications