చైనా న్యూ క్లియర్ మిసైల్స్ సామ్రాజ్యం.. వణుకుతున్న అమెరికా..!
డిఫెన్స్ రంగంలో చైనా రోజురోజుకూ మరింతగా బలపడుతోంది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు తన అమ్ముల పొదిలో ఆయుధాలను పెంచుకుంటోంది. తాజాగా చైనాలోని జిన్జియాంగ్ తూర్పు ప్రాంతం, గన్సు ప్రావిన్స్ లోని ఎడారి ప్రాంతంలో చైనా భారీ ఎత్తున సైనిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ కాంక్రీట్ ప్యాడ్ లు విస్తరించి ఉన్నాయి. వీటిని చైనాకు చెందిన రోడ్- మొబైల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ లాంచర్లు, వైమానిక రక్షణ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వార్ ఫేర్ నోడ్స్ కోసం ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక గత ఆరేళ్ల నుంచి నిర్మిస్తున్న ఆక్టాగాన్ షేప్ సైనిక కేంద్రాల చుట్టూ ఈ మౌలిక సదుపాయాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇవి నివాస గృహాలు, వైమానిక క్షేత్రాలు, రైల్వే లైన్లు, భారీ సైనిక వాహనాలకు వసతి కల్పించే కేంద్ర కమాండ్ సెంటర్లుగా పనిచేస్తాయి. ఈ ఆక్టాగాన్ షేప్ సైనిక కేంద్రాల చుట్టూ రోడ్లు, ఆర్మ్ డ్ బంకర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు, లాంచ్ సైట్లు, శాటిలైట్ డిష్ లతో కూడిన హైటెక్ మైక్రోవేవ్, స్పేస్ కమ్యూనికేషన్స్ టవర్స్ ఉన్నాయి.
ఈ మౌలిక సదుపాయాల విస్తృతి.. శత్రువుల దాడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఉద్దేశించినదని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా తన అణ్వాయుధాల విషయంలో నో ఫస్ట్ యూజ్ అనే కఠిన సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. అంటే శత్రువులు మొదట దాడి చేసినా.. దానిని తట్టుకుని నిలబడి ఆ తర్వాత ప్రతిదాడి చేయడంపైనే చైనా వ్యూహం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అమెరికా లాంటి దేశాలు చైనా భూగర్భ క్షిపణి సైలోలపై ముందస్తు దాడికి ప్రయత్నిస్తే వాటిని రక్షించడానికి దీటుగా ప్రతిఘటించడానికి ఈ భారీ మొబైల్ లాంచ్ ప్యాడ్ లు, ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ లు చైనాకు ఎంతో సాయపడతాయి.

ఇక అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్ అంచనా ప్రకారం.. చైనా తన ప్రధాన సైలో ఫీల్డ్ లలో ఇప్పటికే దాదాపు 100 ఐసీబీఎంలను సిద్ధం చేసింది. అలాగే 2030 నాటికి 1000 కార్యాచరణ అణు వార్ హెడ్ లను మోహరించే దిశగా చైనా ప్రయత్నాలు చేస్తోంది. తైవాన్ సార్వభౌమాధికారం, సముద్ర వివాదాలపై అమెరికా- చైనా మధ్య ఘర్షణలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ఈ శాటిలైట్ చిత్రాలు ఆందోళన కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications