కోవిడ్-19 పై సంచలన వ్యాఖ్యలు చేసిన చైనా: శ్వేతపత్రం విడుదల...అప్పుడే తెలుసంటూ..?
బీజింగ్: కరోనావైరస్ గురించి ప్రపంచదేశాలను అలర్ట్ చేయడంలో విఫలమైందని వస్తున్న ఆరోపణలను చైనా కొట్టివేసింది. వూహాన్‌లో డిసెంబర్ 27న వైరస్‌కు సంబంధించి తొలి కేసు బయటపడింది.అయితే మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సోకుతుందని గుర్తించింది మాత్రం జనవరి 19నే అని వెల్లడించింది. అయితే వెంటనే చర్యలకు దిగామని కూడా డ్రాగన్ కంట్రీ విడుదల చేసిన శ్వేతపత్రంలో వెల్లడించింది. కరోనావైరస్ గురించి తాము నిజాలను దాయలేదని ఈ శ్వేతపత్రంలో వివరించింది చైనా ప్రభుత్వం.

శ్వేతపత్రం విడుదల చేసిన చైనా ప్రభుత్వం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా పలు ప్రపంచ దేశాధినేతలు కరోనావైరస్ వ్యాప్తికి కారణం చైనానే అని ఆరోపణలు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో చైనా శ్వేతపత్రం విడుదల చేసింది. చైనా వైరస్ గురించి బయట ప్రపంచానికి సమాచారం ఇవ్వకపోవడంతోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి పాకిందని కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. అంతేకాదు ఈ మహమ్మారి దెబ్బకు ప్రాణాలతో పాటు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మునుపెన్నడూ లేని విధంగా కుదేలైందని.. ఇప్పుడప్పుడే ఇది కోలుకోలేదంటూ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ వెల్లడించింది. అంతేకాదు ఈ మహమ్మారిపై పోరు చేసేందుకు దేశాలు కలిసి రావాలని ప్రపంచ బ్యాంకు కూడా పిలుపునిచ్చింది.

డిసెంబర్ 27న తొలి కేసు గుర్తింపు..
వూహాన్‌లో డిసెంబర్ 27న వైరస్‌కు సంబంధించి కేసు బయటపడటంతో వెంటనే స్థానిక ప్రభుత్వం నిపుణులను పిలిపించి పేషెంట్‌కు సంబంధించి పూర్తి విశ్లేషణ చేయించింది. వైరస్‌కు సంబంధించి అన్ని టెస్టులు ఇన్వెస్టిగేషన్‌లు చేయించింది. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్‌ను కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్లు శ్వేతపత్రంలో చైనా ప్రభుత్వం వివరించింది. ఈ రిపోర్ట్స్‌ను స్టడీ చేశాక ఇది వైరల్ న్యూమోనియాగా నిర్థారించడం జరిగిందని చెప్పింది. ఇక దీనిపై చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఉన్నత స్థాయి నిపుణులతో పరిశోధనలు చేయించగా ఈ వైరస్ ప్రమాదకరమైనదని మనిషి నుంచి మరో మనిషికి సోకే అవకాశాలున్నాయంటూ రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని శ్వేతపత్రంలో వివరించింది. ఈ రిపోర్ట్ జనవరి 19న వచ్చిందని వెల్లడించింది. ఇదంతా కాస్త ఆలస్యంగా జరిగిందని అప్పటికే ఈ వైరస్ చాలామందికి పాకిందని స్పష్టం చేసింది.

జనవరి 19 కంటే ముందు లేని ఆధారాలు
జనవరి 19 కంటే ముందు ఈ వైరస్ ప్రమాదకర స్థాయిపై ఎలాంటి రుజువులు లేదా ఆధారాలు లేవని చైనాకు చెందిన ప్రముఖ గుండెసంబంధిత వ్యాధి నిపుణులు వాంగ్ గ్వాంగ్ఫా చెప్పారు. చైనా జాతీయ ఆరోగ్య సంస్థ నియమించిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీలో ఈయన ఒకరుగా ఉన్నారు. వారంతా వూహాన్‌లో అడుగుపెట్టేనాటికి చాలామందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయని చాలామంది జ్వరంతో బాధపడుతున్నారని వెల్లడించారు. అయితే గబ్బిలాలు, అలుగుల నుంచే ఈ వ్యాధి సోకిందని చెబుతున్నారు. అయితే దీనికి కూడా పూర్తిస్థాయిలో ఆధారాలు లేవని చెప్పిన వాంగ్.. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే వైరస్ అని చెప్పాల్సింది సైన్స్ విభాగమని చెప్పారు. ఆ సమయంలో ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉంటే అది తీవ్ర పరిణామాలకు దారితీసి ఉండేదని చెప్పారు.

మనిషి నుంచి మనిషికి సోకుతుందంటూ...
జనవరి 20న రెండు కేసులు బయటపడగా ఆ ఇద్దరికి మరో మనిషి నుంచి సోకడంతో ఇది మనిషి నుంచి మరో మనిషికి పాకుతోందన్న విషయాన్ని గ్రహించినట్లు జాంగ్ నాన్షన్ అనే మరో గుండెసంబంధిత వ్యాధి నిపుణులు చెప్పారు. ఇక న్యుమోనియా కేసులు అధికమవుతుండటంతో చైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మరిన్ని పరీక్షలు చేయడం ప్రారంభించినట్లు తెలిపింది. ఇక అప్పటి నుంచి ఈ వైరస్‌కు సంబంధించి క్రమంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకురావడమే కాకుండా వైరస్ జన్యుక్రమంకు సంబంధించి కూడా సమాచారం ఇచ్చినట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. ఇక వైరస్ ఇతర ప్రావిన్స్‌లో కూడా సోకిందని తెలియడంతో వెంటనే చర్యలు చేపట్టినట్లు శ్వేతపత్రంలో వివరణ ఇచ్చింది.
Recommended Video

కచ్చితంగా విజయం సాధిస్తాం: చైనా
ఇదిలా ఉంటే చైనా చేపట్టిన చర్యను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడినప్పటికీ సరైన సమయంలో సరైన సమాచారం ఇవ్వలేదన్న అసంతృప్తి పలువురు అధికారులు వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. మరోవైపు జిన్‌పింగ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కూడా ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం చైనాలో వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ ట్రయల్స్ విజయవంతమైతే ప్రపంచానికి పరిచయం చేస్తామని చైనా ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ సమాజం ఈ మహమ్మారి పోరుపై ఒక్కటవ్వాలని చైనా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో కోరింది. సంఘీభావం తెలపడమే సగం బలం అని పేర్కొన్న శ్వేతపత్రం ఈ మహమ్మారిపై కచ్చితంగా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications