
తైవాన్‌ను చుట్టుముటిన డ్రాగన్: మాటల నుంచి చేతల యుద్ధానికి చైనా-అమెరికా: ఏ క్షణమైనా
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాతో చైనా మొన్నటివరకు మాటల యుద్ధానికి దిగింది. ఘాటు వ్యాఖ్యలు చేసింది. తీవ్ర హెచ్చరికలనూ జారీ చేసింది. అమెరికాను రెచ్చగొట్టేలా మాటల తూటాలను సంధించింది. నిప్పుతో చెలగాటం ఆడొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనిపై అమెరికా కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ముఖాముఖిగా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరింది. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడింది. ఇప్పుడిది చేతల యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది.

తైవాన్‌లో న్యాన్సీ పెలోసీ..
దీనికి ప్రధాన కారణం- తైవాన్ వివాదం. అమెరికా హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనకు రావడమే. న్యాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తోన్నారు. రాజధాని తైపేలో అడుగు పెట్టారు. పెలోసీ పర్యటనకు అమెరికా తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇంతకుముందే చైనా హెచ్చరించింది. తైవాన్‌ను సందర్శించాలనుకోవడం ఆ దేశ అంతర్గత విషయం కాదని స్పష్టం చేసింది. తదుపరి కార్యాచరణకూ దిగింది డ్రాగన్ కంట్రీ.

బైడెన్-జిన్‌పింగ్ మధ్య..
అదే విషయం మీద అమెరికా, చైనా అధ్యక్షులు జో బైడెన్-గ్ఝి జిన్‌పింగ్ సైతం సవాల్, ప్రతిసవాల్ విసురుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు దేశాధినేతల మధ్య ఫోన్ సంభాషణ సాగింది. జో బైడెన్ తన జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మూడున్నర గంటల పాటు మాట్లాడారు. తానే స్వయంగా ఫోన్ చేశారు. తైవాన్ విషయంలో తలదూర్చి, నిప్పుతో చెలగాటం ఆడొద్దని గ్ఝి జిన్‌పింగ్ నేరుగా జో బైడెన్‌ను హెచ్చరించారు. తైవాన్.. వన్ చైనా పాలసీలో భాగమని స్పష్టం చేశారు. దాన్ని అమెరికా మార్చలేదని తేల్చి చెప్పారు.

చేతలకు దిగిన చైనా..
ఈ హెచ్చరికల మధ్య న్యాన్సీ పెలోసీ- తైవాన్ పర్యటనను చేపట్టారు. తైపేలో అడుగు పెట్టిన మరుక్షణమే.. చైనా చేతలకు దిగింది. తూర్పు చైనాలో మిలటరీ డ్రిల్‌ను చేపట్టింది. మిస్సైల్స్‌ను సంధించింది. తన రక్షణ వ్యవస్థ సత్తాను అమెరికా తెలియజేసే ప్రయత్నానికి పూనుకుంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు నేరుగా యుద్ధానికి దిగేలా సన్నాహాలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

త్రివిధ దళాల డ్రిల్..
చైనాకు చెందిన త్రివిధ దళాలూ ఈ డ్రిల్‌లో పాల్గొంటోన్నాయి. ఆర్మీ, నౌకా, వైమానిక దళాలు తమ శక్తి సామర్థ్యాలను చాటుతున్నాయి. చైనా ఉత్తర ప్రాంత గగనతలం, నైరుతి, ఈశాన్య ప్రాంతాల్లో గల సముద్ర జలాల్లో ఈ డ్రిల్ కొనసాగుతోంది. ఆయా ప్రాంతాలన్నీ తైవాన్‌కు అతి సమీపంలో ఉన్నవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకరకంగా న్యాన్సీ పెలోసీ పర్యటిస్తోన్న సమయంలో చైనా.. తన యుద్ధ సామాగ్రితో తైవాన్‌ను చుట్టుముట్టినట్టయింది.

మిస్సైల్స్ టెస్ట్
కన్వెన్షనల్ మిస్సైల్ టెస్ట్ సైతం చేపట్టినట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ షి యి తెలిపారు. జాయింట్ బ్లాకేడ్స్, సీ అస్సాల్ట్, ల్యాండ్ అటాక్స్, ఎయిర్ సుపీరియారిటీ.. వంటి అత్యాధునిక యుద్ధ సామాగ్రితో ఈ డ్రిల్ నిర్వహిస్తోన్నట్లు పీఎల్‌ఏ ఈస్టర్న్ థియేటర్ కమాండర్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గు ఝాంగ్ వివరించారు. ఓ సంపూర్ణమైన యుద్ధ సన్నాహకంగా అభివర్ణించారు.