ఇరాన్ డ్రోన్ల వెనుక దాగున్న అసలు సూత్రధారి? అమెరికా నిఘా వర్గాల షాకింగ్ రిపోర్ట్!
చైనాకు చెందిన శాటిలైట్ డేటా, భౌగోళిక నిఘా సమాచారం కారణంగా ఇరాన్ తన డ్రోన్, క్షిపణి దాడుల ఖచ్చితత్వాన్ని విపరీతంగా పెంచుకుందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ నిర్వహిస్తున్న దాడులకు చైనా సంస్థలు అందిస్తున్న ఇంటెలిజెన్స్ సహకారమే కీలకమని అంతర్జాతీయ మీడియా నివేదించింది. ముఖ్యంగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన ప్రాణాంతక దాడిలో ముగ్గురు యూఎస్ సైనికులు మరణించడానికి, ఇరాన్ సొంత సామర్థ్యానికి మించిన ఈ ఖచ్చితమైన సమాచారమే కారణమని నాలుగు సీనియర్ అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.
హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు సహకారం
హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు, అమెరికా రక్షణ నౌకలను లక్ష్యంగా చేసుకోవడంలో చైనా జియోస్పేషియల్ డేటా ఇరాన్‌కు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇరాన్ వద్ద ఉన్న సాధారణ, దశను మార్చుకోలేని హీట్-సీకింగ్ డ్రోన్ మోడళ్లను సైతం సరైన సమయంలో ఖచ్చితమైన ప్రణాళికతో ప్రయోగించడానికి ఈ శాటిలైట్ డేటా ఉపకరిస్తోంది. దీనివల్ల సాధారణ డ్రోన్లు కూడా అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే సరుకు రవాణా నౌకలను తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

రష్యా అనుభవం, చైనా టెక్నాలజీతో పెరిగి సామర్థ్యం
ఇరాన్ కేవలం చైనా శాటిలైట్ సమాచారంపైనే ఆధారపడకుండా రష్యా నుంచి పొందుతున్న రక్షణ సహకారాన్ని కూడా ఉపయోగిస్తోంది. యుద్ధ రంగంలో పొందిన అనుభవంతో పాటు చైనా అందించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఉపగ్రహ దృశ్యాలు ఇరాన్ దాడి సామర్థ్యాన్ని రెట్టింపు చేశాయని యూఎస్ వర్గాలు వెల్లడించాయి. చైనా నేరుగా ప్రభుత్వం పరంగా సాయం చేస్తోందా లేక అక్కడి ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలను ఉపేక్షిస్తోందా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ.. ఈ సాయం ఇరాన్ సైన్యానికి సాధన చేయడానికి, వ్యూహాలు మార్చుకోవడానికి తగినంత సమయాన్ని ఇచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చైనా ఖండన, అమెరికా తీవ్ర హెచ్చరికలు
తమ సంస్థలు ఇరాన్‌కు డేటాను అందిస్తున్నాయని ఆరోపణలను చైనా రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. తమ భాగస్వామ్యాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉన్నాయని, అనవసరంగా ఇతర దేశాలు ఈ వివాదంలోకి చైనా పేరును గుంజుతున్నాయని పేర్కొంది. అయితే వాషింగ్టన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తో జరిగినే భేటీలో అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా శాటిలైట్ సమాచారం, సైనిక విడిభాగాలను అందించడం 'పూర్తిగా అంగీకారం కానిది' అని చైనాకు స్పష్టం చేసినట్లు చైనాలో యూఎస్ రాయబారి డేవిడ్ పెర్డ్యూ వెల్లడించారు. ఇప్పటికే చైనాకు చెందిన 'మిజార్ట్ విజన్', 'ఎర్త్ ఐ' వంటి సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది.














Click it and Unblock the Notifications
