భారత్ నుంచి రాకపోకలకు గేట్లు తెరిచిన చైనా- తమ వ్యాక్సిన్ తీసుకోవాలని షరతు
ప్రపంచానికి కరోనా అంటించిన ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న చైనా తాజాగా విదేశీ ప్రయాణికులకు ఓ కొత్త షరతు విధించింది. ముఖ్యంగా భారత్ నుంచి చైనా వచ్చే ప్రయాణికులకు తమ దేశంలో తయారైన వ్యాక్సిన్లు తీసుకుంటేనే అనుమతిస్తామని భారత్‌లో చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. అంటే భారతీయ వ్యాక్సిన్లు తీసుకుని చైనా రావాలనుకుంటే కుదరదని స్పష్టం చేసింది.
గతేడాది నవంబర్ నుంచి భారత్ నుంచి చైనాకు రావాలనుకునే ప్రయాణికులపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. కోవిడ్ వ్యాప్తి భయాలతో భారత్ నుంచి వచ్చే వారికి వీసాలు కూడా మంజూరు చేయడం లేదు. దీంతో చైనా యూనివర్శిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఓ అంచనా ప్రకారం భారత్ నుంచి చైనాకు దాదాపు 23 వేల మంది విద్యార్ధులు వెళ్లి చదువుతున్నట్లు తేలింది. చైనా ప్రభుత్వ నిర్ణయంతో వీరికి ఇబ్బందులు తప్పడం లేదు.

అయితే తాజాగా విదేశీయుల్ని చైనాలోకి అనుమతించేందుకు అంగీకరించిన జిన్‌పింగ్ సర్కారు... తమ దేశంలో తయారైన వ్యాక్సిన్లు వేయించుకోవడాన్ని తప్పనిసరి చేసింది. భారత్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతున్నా అందరికీ అందుబాటులోకి రాలేదు. ముఖ్యంగా ఇక్కడ చదువుకునే విద్యార్ధులకు వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు. దీంతో చైనా వెళ్లే విద్యార్ధులకు మాత్రం ఆ దేశ ప్రభుత్వ నిర్ణయం కొంత మేర ఊరట కలిగించనుంది. భారత్ నుంచి ప్రయాణికులను అనుమతించేందుకు వ్యాక్సిన్ షరతు విధించిన అక్కడి ప్రభుత్వం.. విద్యార్ధుల గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. దీంతో మిగతా అందరితో పాటే విద్యార్ధులకూ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications