సిల్క్ రూట్‌ది అతి పెద్ద చరిత్ర: చైనా లక్ష్యం ఇదీ...

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

బీజింగ్: సిల్క్‌రోడ్‌! ఇప్పుడు అంతర్జాతీయంగా చాలా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. ప్రపంచ వేదిక మీద.. ముఖ్యంగా ఆసియాలో అగ్రరాజ్యంగా పట్టు సాధించేందుకు చైనా భారీ వ్యయంతో మొదలుపెట్టిన అతి భారీ మౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టు. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. అతి ప్రాచీన కాలం నుండి ఇటీవలి వరకూ కొన్ని వందల ఏళ్ల పాటు తూర్పు ప్రపంచాన్ని పశ్చిమ ప్రపంచంతో అనుసంధానించిన వాణిజ్య మార్గాల వ్యవస్థ ఇది. తూర్పు, పశ్చిమ నాగరికతల మధ్య వారధి. ఇందులో సుదీర్ఘమైన రహదారులు, సుదూర సముద్ర మార్గాలు ఉన్నాయి. దీనికి రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది మరి. ప్రధానంగా చైనాలో ఉత్పత్తయిన సిల్కును గుర్రాల మీద ఈ మార్గాల ద్వారా రవాణా చేస్తుండటంతో దీనికి సిల్క్‌మార్గంగా పేరు వచ్చింది.

తూర్పు పశ్చిమ దేశాలకు వారధిగా నిలిచిన ప్రాచీన సిల్క్‌మార్గం చైనా కింద కొరియా ద్వీపకల్పం నుంచి జపాన్‌మీదుగా మధ్యధరా సముద్రం వరకూ విస్తరించింది. ప్రస్తుత శకానికి పూర్వం (క్రీస్తు పూర్వం) 207 నాటి హాన్‌హయాంలో మొదలైన ఈ మార్గాల అన్వేషణ ఆసియా ఖండంలోని దాదాపు అన్ని దేశాలనూ కలుపుతూ.. అరబ్‌దేశాల మీదుగా ఐరోపా వరకూ విస్తరించింది.

భూమి మీద రహదారి మార్గాలు, సముద్రం మీద జల మార్గాలతో కూడిన ఈ సిల్క్‌రోడ్‌.. రెండు వేల ఏళ్లకు పైగా చైనా, కొరియా, జపాన్, భారత ఉపఖండం, పర్షియా, యూరప్, ఆఫ్రికా కొమ్ము, అరేబియా దేశాల మధ్య వాణిజ్య, రాజకీయ, సాంస్కృతిక సంబంధాలకు వారధిగా నిలిచింది.ఈ ప్రాచీన సిల్క్‌మార్గాన్ని యునెస్కో 2014లో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది.

Chinese President Xi Tells Silk Road Tales

వాణిజ్య, ఆర్థిక రంగాల్లో విస్తరణకే చైనా ముందడుగు

ఈ ప్రాచీన సిల్క్‌రోడ్‌నే చైనా తన ఆర్థిక, వాణిజ్య విస్తరణకు, రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి అధునాతనంగా తీర్చిదిద్దాలని తలపెట్టింది. ఇందుకోసం దాదాపు ఐదు కోట్ల కోట్ల రూపాయలు (8 ట్రిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెడుతోంది. దాదాపు 60 దేశాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ భూ, జల మార్గాల రవాణా వ్యవస్థకు 'వన్‌బెల్ట్‌ వన్‌రోడ్‌' ప్రాజెక్టుగా చైనా పేరు పెట్టింది. దీనినే 21 శతాబ్దపు సిల్క్‌రోడ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రాచీన సిల్క్‌రోడ్‌మార్గాల్లో.. 21వ శతాబ్దపు సిల్క్‌రోడ్‌ ఎకానమిక్‌ కారిడార్, సముద్ర సిల్కు మార్గాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ‌2013లో వివిధ ఆసియా దేశాల పర్యటనలో ప్రతిపాదన తెచ్చారు.

మధ్య ఆసియా, పశ్చిమాసియా, తూర్పు మధ్య ఆసియా, యూరప్‌దేశాల మీదుగా గల పురాతన సిల్క్‌రోడ్‌ వెంబడి గల దేశాలను కలుపుతూ మౌలిక వసతుల నిర్మాణం, సాంస్కృతిక రాకపోకల పెంపు, వాణిజ్య విస్తరణల ద్వారా ఆర్థిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలన్నది ఆ ప్రతిపాదన లక్ష్యం. దీనిని దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకూ విస్తరించాలన్నది చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఉద్దేశం. ఈ ప్రాంతంలోని చాలా దేశాలు చైనా సారధ్యంలోని ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ)లో సభ్య దేశాలు కూడా.

మధ్య ఆసియా నుంచి యూరప్ వరకు..

సిల్క్ రోడ్డు మధ్య ఆసియా, రష్యా మీదుగా యూరప్‌వరకూ వెళుతుంది. మధ్య వరుస మధ్య ఆసియా, పశ్చిమాసియా మీదుగా పర్షియన్‌గల్ఫ్, మధ్యధరా ప్రాంతం వరకూ వెళుతుంది. దక్షిణ వరుస చైనా నుంచి మొదలై ఆగ్నేయాసియా, దక్షిణాసియా, హిందూమహాసముద్రం మీదుగా వెళుతుంది. 21వ శతాబ్దపు సముద్ర సిల్క్‌రోడ్‌ప్రాజెక్టులో భాగంగా.. దక్షిణ చైనా సముద్రం, దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రం, హిందూ మహాసముద్రాల మీదుగా దక్షిణాసియా, ఓషియానా, ఉత్తర ఆఫ్రికాలను కలపడం లక్ష్యం.

ఈ 'వన్‌బెల్ట్‌ వన్‌రోడ్‌' ప్రాజెక్టుకు అనుబంధంగా చైనా - పాకిస్తాన్‌ఆర్థిక కారిడార్‌ (సీపీఈసీ), బంగ్లాదేశ్‌ - చైనా - ఇండియా - మయన్మార్‌ (బీసీఐఎం) ఆర్థిక కారిడార్లను కూడా చైనా అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా.. చైనా నూతన సిల్క్‌రోడ్‌ ప్రాజెక్టులో భూ సముద్ర మార్గాలను అనుసంధానించే లింకు సీపీఈసీ. ఈ సీపీఈసీలో పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ఓడరేవు కేంద్ర బిందువు.

Chinese President Xi Tells Silk Road Tales

ఈ ప్రాజెక్టులో ఇమిడి ఉన్న ఆర్థిక, భౌగోళిక కారణాలు

చైనా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టడం వెనుక ఆర్థిక, భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయనేది అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అభివృద్ధిలో వెనుకబడిన యురేసియా, ఆఫ్రికా దేశాలలో రోడ్లు, రైల్వే లైన్లు, ఓడరేవులు నిర్మించాలన్న చైనా ప్రణాళిక రాజకీయ ప్రేరేపితమైనదని.. అమెరికాను తోసిరాజని ఆసియాలో తన నాయకత్వ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు రచించిన వ్యూహమని ఫిట్చ్‌రేటింగ్స్‌అనే సంస్థ అభివర్ణించింది.

ఇది ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా తనను తాను స్థాపించుకునేందుకు, ప్రత్యేకించి దక్షిణాసియా దేశాల్లో తన బలం విస్తరణకు అమలు చేస్తున్న అద్భుత ప్రణాళికగా భావిస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్‌వంటి దక్షిణాసియా దేశాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం కోసం వందల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఇది చైనాకు వాణిజ్యపరంగానూ సైనికపరంగా కీలక అవకాశాలు కల్పిస్తోంది.

మిగులు ఉత్పత్తులతో మౌలిక వసతుల కల్పనకు వెసులుబాటు

చైనా పారిశ్రామిక ఉత్పాదకత ముఖ్యంగా ఇనుము, సిమెంట్, భారీ పరికరాల తయారీ రంగాల సామర్థ్యం మిగులు స్థాయికి పెరిగిపోయింది. ఆ మిగులు ఉత్పత్తుల వినియోగానికి ఈ భారీ మౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతున్నది. మరోవైపు చైనా అంతర్గత మార్కెట్‌కూడా మందగిస్తోంది. కొత్త వాణిజ్య విపణులకు చేరుకోవడం ద్వారా తమ దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి వీలు కలుగుతుంటుంది. సీమాంతర వాణిజ్యం దశాబ్ద కాలంలో 2.5 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని చైనా ఆశిస్తోంది.

అందుకే లక్ష కోట్ల డాలర్ల ప్రభుత్వ నిధులను ఈ ప్రాజెక్టులో పెట్టుబడులుగా మళ్లించింది. చైనా ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలను కూడా విదేశాల్లో మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సర్కారు ప్రోత్సహిస్తోంది. తజకిస్తాన్, థాయ్‌లాండ్, కెన్యాల్లో రైల్వేల నిర్మాణ పనులు, వియత్నాం, కిర్గిజిస్తాన్‌లలో విద్యుత్‌ప్లాంట్లు వంటి డజన్ల కొద్దీ ప్రాజెక్టులను చైనా ప్రారంభించింది.

దక్షిణాసియా దేశాల్లోనూ భారీ చైనా ప్రాజెక్టులు

పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలోనూ భారీ నౌకా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అందులో చాలా వరకూ చైనానే పెట్టుబడులు పెట్టింది. 'ఆయా దేశాల్లో చైనా పెట్టుబడుల్లో అత్యధిక భాగం రుణాల రూపంలోనే ఉంటాయి. తనే రుణాలు ఇచ్చి తన ఉత్పత్తులు, సాంకేతికతలనే ఉపయోగించి ఈ మౌలిక నిర్మాణాలు చేపడుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలు చైనాకు రుణపడి ఉంటాయి. అది చైనా ప్రాంతీయ ఆధిపత్యానికి విధేయతగానూ ఉంటుంది. చైనాకు ఆర్థికంగానూ లాభిస్తుంది'' అని మరికొందరు పరిశీలకులు భావిస్తున్నారు.

ఇది చైనాను ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లతో అనుసంధానించే ప్రణాళిక. పాతికేళ్ల కిందట ప్రపంచీకరణ అగ్రరాజ్యం అమెరికా సారథ్యంలోని పశ్చిమ దేశాలతో మొదలైంది. ఇప్పుడు అవే పశ్చిమ దేశాలు అమెరికా సహా ప్రపంచీకరణ నుంచి వెనుకడుగు వేస్తున్నాయి. ఇప్పుడు తూర్పు ప్రపంచం నుంచి చైనా సారథ్యంలో రెండో ప్రపంచీకరణ మొదలవుతోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులకు లోనవుతోందని, అంతర్జాతీయ ఓపెన్‌మార్కెట్లకు కట్టుబడి ఉంటామని చైనా బాహాటంగానే చెప్తోంది. 'వన్‌బెల్ట్‌ వన్‌రోడ్‌' ప్రాజెక్టు రెండో ప్రపంచీకరణ వంటిదని చైనా అధికారిక వార్తాసంస్థ జిన్హువా పేర్కొన్నది.

ఆచితూచి స్పందిస్తున్న మోదీ సర్కార్

పొరుగు దేశాల్లో ప్రాబల్యం పెంచుకోవడం చైనా ఉద్దేశమని భారత్‌ భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. వన్‌బెల్ట్‌ వన్‌రోడ్‌ప్రాజెక్టు విషయంలో చైనాతో కూలంకుషంగా చర్చించనిదే భాగస్వాములం కాబోమని స్పష్టం చేసింది. అణ్వాయుధ దేశాలైన చైనా, పాకిస్తాన్‌ మధ్యలో భారత్‌ ఉంది. ఆ రెండు దేశాలతోనూ భారత్‌యుద్ధాలు చేసింది. చైనాతో 1962 యుద్దం తాలూకు నీలినీడలు ఇంకా తొలగిపోలేదు. ఈ పరిస్థితుల్లో చైనాలోని పశ్చిమ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో చైనా నిర్మించిన గ్వాదర్‌ ఓడరేవును కలుపుతూ చైనా - పాక్‌ ఆర్థిక కారిడార్‌ను చైనా చేపట్టింది. ఈ కారిడార్‌.. వాస్తవ కశ్మీర్‌లో భాగమైన గిల్గిట్‌ బాల్తిస్తాన్, పాక్‌ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా పాక్‌లో ప్రవేశిస్తుంది.

ఇదే భారత్‌కు తీవ్ర అభ్యంతరమైన విషయం. భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్‌లోని గిల్గిట్, పీఓకే. కానీ ఈ ప్రాంతాలు భారత్‌ - పాక్‌ మధ్య వివాదాస్పద ప్రాంతాలుగా ఉండగా.. అందులో నుంచి మూడో దేశమైన చైనా ఆర్థిక కార్యకలాపాలు నెరపడం, భారీస్థాయిలో మౌలిక వసతులు నిర్మించడం.. భారత తన సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తోందని మండిపడుతోంది. అందువల్లే.. ఇటీవల చైనా నిర్వహించిన సదస్సుకు భారత్‌హాజరుకాలేదు. కానీ చైనా బృహత్తర ప్రాజెక్టు ప్రపంచ గతిని మార్చేస్తుందని పాకిస్థాన్‌ స్వాగతిస్తోంది.

ముఖ్యంగా చైనా పాక్‌మ్రైత్రిని సీపీఈసీ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యంగా మారుస్తుందని పాక్‌ హర్షం వ్యక్తం చేస్తోంది. అందుకే ఇటీవల జరిగిన సదస్సులో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. ఈ సీపీఈసీ ప్రాజెక్టును రాజకీయం చేయొద్దని పరోక్షంగా భారతదేశానికి సూచించారు. ఇప్పటికే సన్నిహిత రాజకీయ, సైనిక సంబంధాలున్న పాక్‌ చైనాల స్నేహానికి కొత్తగా కీలకమైన ఆర్థిక కోణాన్ని కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుంది. కానీ.. భారతదేశంలో ఈ ప్రాజెక్టు మీద భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే.. పాకిస్తాన్‌ మీద సహజమైన వ్యతిరేకత, చైనా మీద వ్యూహాత్మక అపనమ్మకం భారత్‌లో ప్రధానంగా కనిపిస్తున్నాయి.

జపాన్, ఇండోనేషియాల్లోనూ ఆందోళన

భారత్‌తో పాటు జపాన్, ఇండొనేసియా తదితర దేశాలు కూడా చైనా 'వన్‌రోడ్‌' ప్రాజెక్టుపై ఆందోళన చెందుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులు నిర్మిస్తున్న చైనా ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ ఏకచ్ఛత్రాధిపత్యం కోసం వ్యూహం రచిస్తోందని జపాన్, ఇండొనేసియా ఆందోళన. ఉజ్బెకిస్తాన్‌ తదితర మధ్య ఆసియా దేశాలను చైనా ఆర్థిక వ్యవస్థతో మరింత సన్నిహితంగా అనుసంధానించడం ద్వారా అక్కడ తన ప్రాబల్యాన్ని నీరుగారుస్తోందని రష్యా కూడా కలవరపడుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The ancient city of Almaty is also on the ancient Silk Road. In Almaty, there is a Xian Xinghai Boulevard, which got its name from a true story. At the outset of the Great Patriotic War in 1941, Xian, a renowned Chinese composer, arrived in Almaty after much travail. By then, he was worn down by poverty and illness and had no one to turn to. Fortunately, the Kazakh composer Bakhitzhan Baykadamov took care of Xian and provided him with the comfort of a home.
Please Wait while comments are loading...