77 మంది మృతి, కొలంబియాలో భయంకర దృశ్యాలు!
దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాను భయంకరమైన విపత్తు ముంచెత్తింది. సోమవారం సంభవించిన శక్తివంతమైన భూకంప ధాటికి పలు నగరాలు క్షణాల్లో అతలాకుతలమయ్యాయి. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ రాకాసి భూకంపం కారణంగా ఇప్పటివరకు కనీసం 77 మంది ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వందలాది బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు నేలమట్టం కావడంతో అమాక ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
ఈ దారుణ విపత్తులో అత్యధికంగా రిసారాల్డా ప్రావిన్స్‌లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే వాలే డెల్ కాకా ప్రాంతంలో 27 మంది, చోకో ప్రావిన్స్‌లో నలుగురు, మణిజాలెస్ నగరంలో ముగ్గురు, అంటియోకియా ప్రావిన్స్‌లో ఒకరు మరణించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. ప్రముఖ నగరాలైన పెరీరాలో 18 మంది, కాలి నగరం ఉన్న వాలే డెల్ కాకా విభాగంలో 27 మంది బలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూమికి 107 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు
రాజధాని బొగోటాకు పశ్చిమంగా దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకో రీజియన్‌లోని 'శాన్ జోస్ డెల్ పాల్మర్' ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు భూగర్భ పరిశోధన సంస్థలు వెల్లడించాయి. భూమి అంతర్భాగంలో దాదాపు 107 కిలోమీటర్ల లోతున భారీ మార్పులు రావడం వల్లనే ఈ స్థాయిలో వినాశనం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రకంపనల ధాటికి పొరుగునే ఉన్న ఈక్వెడార్, పనామా దేశాలు కూడా తీవ్రంగా ఉలిక్కిపడ్డాయి.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
విపత్తు సంభవించిన వెంటనే స్థానిక రెస్క్యూ బృందాలు, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. కూలిపోయిన భవనాల శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాధితుల హాహాకారాలతో ప్రభావిత ప్రాంతాలన్నీ అత్యంత విషాదకరంగా మారాయి. పరిస్థితిని విషమంగా పరిగణించిన ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలను వేగవంతం చేసింది.




Click it and Unblock the Notifications