మళ్లీ ముంచుకొస్తున్న కరోనా మహమ్మారి.. ఈసారి మరో కొత్త వేరియంట్ ?
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆసియా దేశాలైన హాంగ్‌కాంగ్, సింగపూర్ లలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కారణంగా ఆస్పత్రి బాట పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతే కాకుండా కరోనా సోకి చనిపోతున్న వారు కూడా పెరుగుతుండడం అందరికీ దడ పుట్టిస్తోంది.
జనాభా పరంగా ఎక్కువగా ఉండే దేశాల్లో హాంకాంగ్, సింగపూర్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ దేశాల్లోనే కొవిడ్ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల చోటు చేసుకుంటుంది. అలానే థాయిలాండ్, చైనా దేశాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు సమాచారం. దీంతో కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని.. ఆరోగ్య అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారు బూస్టర్ షాట్‌లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం సహా పలు కారణాల వల్ల కరోనా కేసుల పెరుగుదల ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.

హాంకాంగ్‌లో ఇటీవల నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఏడాదిలో అత్యధిక స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మరణాలు సంఖ్య కూడా ఈ ఏడాదిలోనే గరిష్టంగా 31కి చేరుకున్నట్లు వాపోతున్నారు. అటు సింగపూర్ లో కూడా కొవిడ్ కేసుల పెరుగుదలతో అలర్ట్ జారీ చేశారు. మే 3వ తేదీ నాటికి అంచనా వేసిన కేసుల సంఖ్య కంటే 28 శాతం పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య 14,200కు చేరుకున్నట్లు సమాచారం. నిత్యం ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కూడా దాదాపు 30 శాతం పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు.
అమెరికాలోని డాక్టర్ల నివేదిక ప్రకారం.. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 70 శాతం వరకు ఎల్‌పీ.8.1 అనే కొత్త వేరియంట్ కారణంగా భావిస్తున్నారు. మరో 9 శాతం కేసులకు ఎక్స్‌ఎఫ్‌సీ వేరియంట్ కారణమని నిర్ధారించారు. ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాల్లో ఈ కొత్త వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైతే కరోనా బూస్టర్ డోసులు తీసుకోవాలని.. ఫ్లూ వ్యాక్సిన్ తరహాలోనే వీటిని కూడా పరిగణించాలని కోరుతున్నారు. మరోవైపు ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఎఫ్‌డీఏ.. నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి ఇష్యూ చేసింది. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్నకొత్త వేరియంట్‌లు.. గతంలో ఉన్న వాటి కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications