‘కరోనావైరస్’ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన
దిహేగ్: కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. గత మూడేళ్లకుపైగా ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కారణంగా విధించిన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని తొలిగించింది. ఈ మేరకు కోవిడ్-19 గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ముగిసిందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సమస్యలపై మీడియా సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. కోవిడ్ అత్యవసర దశ ముగిసిందన్నారు. అయితే మహమ్మారి మాత్రం అంతం కాలేదని అన్నారు. 1, 221 రోజుల క్రితం చైనాలోని వుహాన్‌లో తెలియని కారణంతో కొన్ని కొత్త రకం కేసులు నమోదయ్యాయని టెడ్రోస్ అదనామ్ గెబ్రెయస్ పేర్కొన్నారు.

జనవరి 30, 2020న అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం సమావేశమైన ఎమర్జెన్సీ కమిటీ సలహా మేరకు కరోనా వ్యాప్తిపై ఆందోళన చెంది గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించామని గుర్తు చేశారు. సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుంచి కరోనా కేసులు, మరణాలు కూడా తగ్గాయని.. దీంతో వైద్య వ్యవస్థపై కాస్త ఒత్తిడి తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ వెల్లడించారు.
మనం మళ్లీ గతంలో మాదిరిగా యథాతథంగా జీవించేందుకు అవకాశం కలిగిందంటూ టెడ్రోస్ తెలిపారు. కోవిడ్ 19 ఆరోగ్య సంక్షోభం కంటే మరింత తీవ్రమైందని తెలిపారు. కరోనా ఎన్నో ఆరోగ్య, ఆర్థిక సమస్యలను తీసుకొచ్చిందన్నారు. అంతేగాక, కొన్ని కోట్ల మంది ఒంటరితనంతో ఆందోళన, నిరాశకు గురయ్యారని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మంది పేదరికంలోకి వెళ్లిపోయారని, అనేక వ్యవస్థలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయిన వెల్లడించారు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మరణించిన విషయం తెలిసిందే. మనదేశంలోనూ ఈ మహమ్మారి కారణంగా 5 లక్షల మందికిపైగా మృతి చెందారు. కోట్లాది మంది కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా దేశ వ్యాప్తంగా వేలల్లో కేసులు నమోదు కావడం ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ.. క్రమంగా కేసులు తగ్గుతుండటం, మరణాలు ఎక్కువగా లేకపోవడం ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications