Coronavirus:వైరస్‌కు కారణం గబ్బిలాలే కాదు.. తెరపైకి కొత్త జంతువు తీసుకొచ్చిన సైంటిస్టులు
చైనాను కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఇప్పటికే చైనాలో 722 మంది ఈ మహమ్మారి బారినపడి మృతిచెందారు. అయితే ఇప్పటివరకు కరోనావైరస్ వ్యాప్తి చెందిదంటే అందుకు మూలకారణం గబ్బిలాలే అని శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా మరో జంతువు పేరును కూడా శాస్త్రవేత్తలు తెరపైకి తీసుకొస్తున్నారు. అదే పాంగోలిన్... తెలుగులో అలుగు అని పిలుస్తాము. చైనాలో అలుగులను విరివిగా తింటారట. వైరస్ ఈ జంతువుల నుంచి కూడా మనుషులకు వచ్చి ఉండే అవకాశాలు లేకపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అలుగులు అంతరించి పోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి.

గబ్బిలాల్లో ఉండే వైరస్ అలుగులో కూడా ఉంది
ఇక పాంగోలిన్ జంతువుల జన్యువులను విశ్లేషించగా గబ్బిలాల్లో ఉండే వైరస్ కూడా 96శాతం వీటిల్లో ఉందని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇక కరోనా వైరస్ గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు పాకలేదని గబ్బిలాలకు మనుషులకు మధ్య ఈ అలుగు ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. 2002-03లో ఓ రకమైన కరోనావైరస్ మూలాలను పిల్లిజాతి జంతువుల్లో గమనించినట్లు వైద్యులు తెలిపారు. ఈ జంతువు మాంసంను చైనీయులు చాలా ఇష్టపడతారట. ఇదిలా ఉంటే చాలావరకు వైరస్‌లు జంతువుల నుంచే వ్యాప్తి చెందుతాయని అయితే కరోనావైరస్ మాత్రం అడవుల్లో నివసించే జంతువుల నుంచి మాత్రమే సోకుతుందని చెప్పారు.
Recommended Video

పాంగోలిన్ జంతువు నుంచే వైరస్ వ్యాప్తి
గబ్బిలాల్లో ఉన్న వైరస్ మనుషులకు సోకుతుందని చెప్పేందుకు పూర్తిస్థాయిలో ఆధారాలు లేవని పరిశోధనల్లో తేలింది. అయితే కరోనా వైరస్ ఏ జంతువు నుంచి సోకుతుందో అనేదానిపై ఇంకా స్పష్టత లేదని చెబుతూనే క్షీరద జంతువులే ఇందుకు కారణమై ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వన్య మృగాల నుంచి సేకరించిన 1000కి పైగా శాంపిల్స్‌లో పాంగోలిన్ (అలుగు)లోని వైరస్ కరోనావైరస్ పేషెంట్లకు వచ్చిన వైరస్‌తో 99 శాతం సరిపోలుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది కచ్చితమని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు.

వూహాన్ మార్కెట్లో ప్రతి జంతువును టెస్టు చేయాలి
వైరస్‌కు మూలకారణం ఏంటనేది స్పష్టంగా తెలియాలంటే వూహాన్ సెంట్రల్ మార్కెట్‌లోని ప్రతి జంతువును టెస్టు చేయాల్సి ఉందని కానీ అది అసాధ్యమని చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం ఆ మార్కెట్ కూడా మూసివేయడం జరిగింది. ఇక ఎబోలా వైరస్ రావడానికి కారణం గబ్బిలాలే అని కచ్చితంగా చెప్పగలిగామని ఫ్రాన్స్ వైరాలజిస్టు మార్టిన్ పీటర్స్ చెప్పారు. ఆ సమయంలో పలు చోట్ల నుంచి గబ్బిలాల విడుదల చేసిన డ్రాప్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ఎబోలా వ్యాప్తికి కారణం గబ్బిలాలే అని తేల్చడం జరిగిందని చెబుతున్నారు. కానీ కరోనావైరస్ ఏ జంతువు నుంచి మనిషికి సోకుతుందనేదానిపై స్పష్టత లేదని గుడ్డిగా గబ్బిలం అని చెప్పలేమని వివరించారు. ఇప్పటికే సమయం మించిపోయిందని.. అయినప్పటికీ ఏ జంతువు నుంచి కరోనావైరస్ సోకుతుందో గుర్తిస్తే భవిష్యత్తులో ఇలాంటి వైరస్‌ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు మార్టిన్ పీటర్స్.












Click it and Unblock the Notifications