నెతన్యాహు ప్లాన్-బీ అమల్లోకి..! విపక్ష నేతతో కలిసి ప్రభుత్వం? ఆఫర్స్ ఇవే..!
ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాలేదు. 120 సీట్లున్న పార్లమెంట్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ మార్క్ 61 కాగా.. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (benjamin netanyahu) పార్టీ లికుడ్ కు 53 సీట్లు, విపక్ష నేత గాడీ ఐసెన్ కోట్ కు చెందిన యాషర్ పార్టీకి 48 సీట్లు రాబోతున్నాయి. వీరిద్దరు కాకుండా అరబ్ పార్టీలకు 19 సీట్లు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ప్రధాన పార్టీలకు అరబ్ పార్టీల మద్దతు తప్పనిసరిగా మారింది.
అయితే ఇన్నాళ్లూ తాము యూదు వ్యతిరేకులుగా ముద్ర వేసిన అదే అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజల్లోకి వ్యతిరేకత వస్తుందన్న భయం ఇరు పార్టీలను వెంటాడుతోంది. అయితే ప్రధాని నెతన్యాహుతో పోలిస్తే విపక్ష నేత గాడీ ఐసెన్ కోట్ అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నారు. ఇందుకు ఆయన కొన్ని షరతులు పెడుతున్నారు. ఇది గ్రహించిన నెతన్యాహు.. అరబ్ పార్టీల మద్దతు ఎలాగో తీసుకోరు కాబట్టి ప్లాన్ బీ అమలుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా ఏకంగా ప్రతిపక్ష నేతకే గాలం వేస్తున్నారు.

విపక్ష నేత, మాజీ ఆర్మీ ఛీఫ్ కూడా అయిన గాడీ ఐసెన్ కోట్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని నెతన్యాహు వర్గం భావిస్తోంది. ఇందుకోసం ఆయన వద్దకు రాయబారాలు పంపేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రెండు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో నెతన్యాహు ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఐసెన్ కోట్ కు కీలక మంత్విత్వ శాఖల్ని అప్పగించడం లేదా, నెతన్యాహు-ఐసెన్ కోట్ ఇద్దరూ తలో సగం పదవీకాలం ప్రధానులుగా ఉండేలా ఒప్పందం చేసుకోవడం ఉన్నాయి. అయితే నెతన్యాహు కింద తాను పనిచేసేది లేదని ఐసెన్ కోట్ ఇప్పటికే తేల్చిచెప్పేశారు. అయినా నెతన్యాహు వర్గంలో మాత్రం ఆశ చావడం లేదు. దీంతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.














Click it and Unblock the Notifications
