కాబూల్ స్కూల్ వద్ద బాంబు పేలుళ్లు: 50 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుళ్లు మరోసారి కలకలం రేపాయి. షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలోని ఓ బాలికల పాఠశాల వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. బాలికలు ఇళ్లకు బయల్దేరుతున్న సమయంలో ఒక బాంబు పేలింది. ఆ తర్వాత రెండు రాకెట్ బాంబులను పేల్చారు.
ఈ వరుస బాంబు దాడిలో 50 మంది మరణించారు. వందమందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా యువతులే ఉన్నారు. పేలుళ్లపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

ఈ మేరకు వివరాలను ఆప్ఘాన్ మంత్రి తారీఖ్ అరియాన్ వెల్లడించారు. కాగా, కొందరు ప్రజలు అంబులెన్స్ లను అడ్డుకుని దాడులు చేయడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని, దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆఫ్గాన్ ఆరోగ్యమంత్రి గులాం దస్తగిర్ నాజరి తెలిపారు. ఆ తర్వాత ప్రజలకు సర్దిచెప్పి అంబులెన్స్ లను ఆస్పత్రులకు తరలించామని చెప్పారు.
Recommended Video
అయితే, ఈ బాంబు దాడులకు పాల్పడింది తామేనంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. కాగా, ఈ దాడులు తమపని కాదంటూ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇలాంటి నీచమైన దాడులకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే పాల్పడతారని తాలిబన్ సంస్థ ఆరోపించడం గమనార్హం.












Click it and Unblock the Notifications