బిగ్ డేంజర్ : కొత్త కరోనా వైరస్... 17 మిలియన్ల మింక్స్‌ను చంపేయాలని డెన్మార్క్ నిర్ణయం...
కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా యూరోప్ దేశాలు మళ్లీ లాక్ డౌన్ ఆంక్షలను అమలుచేస్తున్నాయి. మొదటి దశ కరోనా కంటే... రెండో దశలో కరోనా మరింత ప్రాణాంతకంగా మారిందన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో చాలా దేశాలు మళ్లీ అప్రమత్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో నార్త్ యూరోప్ దేశం డెన్మార్క్ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న దాదాపు 17 మిలియన్ల మింక్స్(కుందేలు వలే ఉండే జంతువులు)ను చంపేయాలని నిర్ణయించింది.

రూపాంతరం చెందిన కరోనా వైరస్...
యూరోప్‌లోని స్పెయిన్,నెదర్లాండ్,డెన్మార్క్ లాంటి దేశాల్లో మింక్స్‌ను ఫామ్స్‌లో పెంచుతుంటారు. వీటి చర్మం దట్టమైన ఉన్నితో కప్పబడి ఉంటుంది. ఇటీవలి పరిశోధనల్లో వీటిల్లో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆశ్చర్యకరంగా ఇందులో కరోనా వైరస్ కొత్తగా రూపాంతరం చెందినట్లు గుర్తించారు. అంతేకాదు,మింక్స్ నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్దారించారు. దీంతో దేశంలో ఉన్న మింక్స్ అన్నింటినీ చంపేయాలని డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ అధికారులను ఆదేశించారు. 'మా ప్రజల పట్ల మాకు చాలా బాధ్యత ఉంది. తాజాగా మింక్స్ జంతువుల్లో రూపాంతరం చెందిన కరోనా ఆనవాళ్లు బయటపడ్డాయి.కాబట్టి మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో కరోనా చికిత్స కోసం తీసుకొచ్చే వ్యాక్సిన్ రూపాంతరం చెందిన వైరస్‌ను నిలువరించలేదు.' అని ఫ్రెడరిక్‌సన్ పేర్కొన్నారు.

డెన్మార్క్‌లో కొత్త కరోనా వైరస్ ఆనవాళ్లు...
దేశంలోని మింక్ ఫామ్స్‌లో ఇప్పటివరకూ ఐదు కేసుల్లో కొత్త కరోనా వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు డెన్మార్క్ వైద్యాధికారులు తెలిపారు. అంతేకాదు, 12 కేసుల్లో మనుషుల్లోనూ ఈ కొత్త వైరస్ ఆనవాళ్లు గుర్తించారు. ఓవైపు కరోనా వైరస్‌తో పోరాడుతున్న దశలోనే.. ఈ కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందితే ప్రజారోగ్యం మరింత రిస్క్‌లో పడుతుందని అధ్యక్షురాలు ఫ్రెడరిక్‌సన్ ఆందోళన వ్యక్తం చేశారు. డెన్మార్క్ నుంచి ఈ వైరస్ ఇతర దేశాలకు విస్తరించకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

మింక్స్‌ను చంపేందుకు రంగంలోకి బలగాలు
యుద్దప్రాతిపదికన దేశంలో మింక్స్‌ను చంపేందుకు పోలీసులు,ఆర్మీ,హోంగార్డులను ప్రభుత్వం రంగంలోకి దింపినట్లు ఫ్రెడరిక్‌సన్ తెలిపారు.అలాగే వైరస్ కట్టడి కోసం నార్త్ డెన్మార్క్‌లో కఠినమైన లాక్ డౌన్ నిబంధనలు,ఆంక్షలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. మింక్స్‌లో గుర్తించిన కరోనా కొత్త ఆనవాళ్లతో డెన్మార్క్‌లో వైరస్ కొత్త వేవ్ మొదలైందని సైంటిస్ట్ ఒకరు అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ నిపుణుడు ప్రొఫెసర్ కరె మొల్బక్ మాట్లాడుతూ... ఇప్పటి కరోనా వైరస్‌తో పోలిస్తే... రూపాంతరం చెందిన దాని ఆనవాళ్లు చాలా భిన్నంగా ఉన్నట్లు చెప్పారు. కాబట్టి కరోనా వ్యాక్సిన్‌తోనే దీన్ని కూడా అంతం చేసేలా వ్యాక్సిన్ అభివృద్ది జరగాలన్నారు.

గతంలో స్పెయిన్,నెదర్లాండ్స్‌లోనూ...
గతంలో స్పెయిన్,నెదర్లాండ్స్‌లోనూ వేలాది మింక్స్‌ను చంపేశారు. వీటి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఉదంతాలు బయటపడటంతో మింక్స్‌ను చంపేయాలని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీంతో ఫామ్స్‌లో పెంచుతున్న చాలావరకు మింక్స్‌ను చంపేశారు. యూరోప్ దేశాల్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా డెన్మార్క్‌లో వెలుగుచూసిన కొత్త కరోనా వైరస్ ఆనవాళ్లు ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications