భారత్‌తో పెట్టుకోకు.. బెస్ట్ ఫ్రెండ్ చెప్పినా వినని ట్రంప్!
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్.. భారత్‌తో సహా గ్లోబల్ సౌత్ దేశాల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ట్రంప్‌కు సలహా ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. విదేశాంగ విధానం మిత్రదేశాలకు అనుకూలంగా లేకపోతే అమెరికా, పశ్చిమ దేశాలు తమ పట్టు కోల్పోతాయని అలెగ్జాండర్ స్టబ్ హెచ్చరించారు.
'భారత్‌కు గౌరవం ఇవ్వకపోతే ఆటలో ఓడిపోతాం'
"నా మెసేజ్ కేవలం యూరోపియన్ మిత్రులకు మాత్రమే కాదు, ముఖ్యంగా అమెరికాకు కూడా. భారత్ వంటి గ్లోబల్ సౌత్ దేశాల పట్ల మనం మరింత సహకారపూరితమైన, గౌరవప్రదమైన విదేశాంగ విధానాన్ని రూపొందించకపోతే, మనం ఈ ఆటలో ఓడిపోతాం" అని స్టబ్ అన్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన దృశ్యాలను ఆయన ప్రస్తావించారు. ఇది పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగించిందని ఆయన చెప్పారు.

ట్రంప్ విధానాల వల్ల భారత్ దూరమవుతోందా?
గత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం భారత్‌తో సంబంధాలను బలోపేతం చేయడానికి చాలా కృషి చేసింది. చైనాకు ఒక బలమైన ప్రత్యామ్నాయంగా భారత్‌ను భావించి ఇండో-పసిఫిక్‌లో వ్యూహాలను రూపొందించింది. కానీ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే భారత్‌పై 25 శాతం భారీ సుంకాలను విధించారు. ఆ తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలుపై అదనంగా 25 శాతం టారిఫ్ విధించడంతో మొత్తం టారిఫ్ 50 శాతానికి పెరిగింది. ఈ టారిఫ్ విధానాల వల్ల భారతదేశంలోని వస్త్ర, వజ్రాల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
ఈ టారిఫ్ విధానాల వల్ల అమెరికా, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి, వాణిజ్య చర్చలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ చైనాతో తన సంబంధాలను జాగ్రత్తగా కొనసాగిస్తోంది. ట్రంప్ విధానాల వల్ల భారత్ మళ్లీ రష్యా, చైనాలకు దగ్గరవుతోందని అమెరికా నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ విధ్వంసకర టారిఫ్ విధానాల వల్ల దశాబ్దాల పాటు రష్యా నుంచి భారత్‌ను దూరం చేయడానికి చేసిన ప్రయత్నాలు దెబ్బతిన్నాయని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అన్నారు.












Click it and Unblock the Notifications