Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..!
ఇరాన్ పై ఇజ్రాయెల్ తో కలిసి ఏకపక్షంగా దాడికి దిగిన అమెరికాకు నాలుగు వారాల తర్వాత తత్వం బోధపడింది. ఇప్పుడు ఇరాన్ వార్ నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతోంది. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) తీసుకున్న యుద్ధ నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయినా వారంతా మౌనంగానే భరిస్తున్నారు. కానీ అమెరికాలో జనం మాత్రం ట్రంప్ విధానాల్ని చీదరించుకుంటున్నారు. తాజా సర్వేలో ఇదే వెల్లడైంది.
ఇరాన్ వార్ తో పాటు పెరిగిన చమురు ధరల నేపథ్యంలో స్వదేశంలో డొనాల్డ్ ట్రంప్ కు ఉన్న ప్రజాదరణ రికార్డు స్ధాయిలో 36 శాతానికి పడిపోయినట్లు రాయిటర్స్-ఇప్సోస్ పోల్ లో వెల్లడైంది. తాజాగా నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ పోల్ లో 36 శాతం అమెరికన్లు మాత్రమే ట్రంప్ చర్యల్ని సమర్థిస్తున్నట్లు తేలింది. గత వారం ఇదే ట్రంప్ ను 40 శాతం మంది సమర్థించారు. అంటే కేవలం వారం రోజుల వ్యవధిలో ట్రంప్ నిర్ణయాలకు ఆదరణ నాలుగు శాతం తగ్గిపోయింది.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుండి అమెరికాలో పెట్రోల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, జీవన వ్యయం విషయంలో ట్రంప్‌పై అమెరికన్ల అభిప్రాయాలు గణనీయంగా మారిపోయాయి. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశంగా ఉన్న జీవన వ్యయం సమస్యను ట్రంప్ పరిష్కరించిన తీరును కేవలం 25 శాతం మంది మాత్రమే ఆమోదించారు. ప్రస్తుతం కేవలం 29 శాతం మంది మాత్రమే ట్రంప్ ఆర్థిక నిర్వహణను ఆమోదిస్తున్నారు.

ఇది ట్రంప్ రెండు అధ్యక్ష పరిపాలనలలోనూ అత్యల్ప రేటింగ్. అలాగే ఆయన కంటే ముందున్న అధ్యక్షుడు జో బైడెన్ కు గతంలో లభించిన ఏ ఆర్ధిక రేటింగ్ కన్నా కూడా తక్కువే. ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయంపై ఓటర్ల ఆందోళనలు బైడెన్ ఓటమికి ముఖ్యమైన కారణంగా నిలిచాయి. ట్రంప్ మాత్రం శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని వాగ్దానం చేస్తూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అదే విషయంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని ఈ పోల్ తెలిపింది.












Click it and Unblock the Notifications