ఐరాస వేస్ట్-7 నెలల్లో 7 యుద్దాలు ఆపా-ట్రంప్ మళ్లీ అదే పాట..!
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన చిత్ర విచిత్ర నిర్ణయాలు, వ్యాఖ్యలతో రచ్చ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాను ఇప్పటివరకూ కేవలం ఏడు నెలల కాలంలో ఏడు యుద్ధాలను ఆపానని మరోసారి చెప్పుకున్నారు. ఇందులో భారత్-పాకిస్తాన్ యుద్దం కూడా ఉందన్నారు.
ఇజ్రాయెల్ -ఇరాన్, భారతదేశం -పాకిస్తాన్, రువాండా -డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, థాయిలాండ్-కంబోడియా, అర్మేనియా-అజర్‌బైజాన్, ఈజిప్ట్-ఇథియోపియా, సెర్బియా-కొసావో యుద్ధాల్ని తాను ఆపినట్లు ట్రంప్ ఇవాళ మరోసారి చెప్పుకొచ్చారు. ఇవాళ జరిగిన 80వ ఐరాస సాధారణ సభ సమావేశంలో ప్రసంగించిన ట్రంప్.. ఇవన్నీ అంతులేని యుద్ధాలని, ఇందులో ఒకటి 36, మరొకటి 31 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని తెలిపారు.

తనలా ఇతర దేశాల నాయకులెవరూ ఇలా యుద్దాల్ని ఆపింది లేదన్నారు.అదే సమయంలో ఐక్యరాజ్యసమితిపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. యుద్ధాలను పరిష్కరించడానికి సహాయం చేయడానికి కూడా ఐరాస ప్రయత్నించలేదన్నారు. ఇది దాని సామర్థ్యానికి దగ్గరగా కూడా రావడం లేదన్నారు. ఐరాసవన్నీ డొల్ల మాటలని, వీటితో యుద్దాలు ఆగవన్నారు. తద్వారా ఐరాస కంటే తానే యుద్దాల్ని ఆపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే తనకు నోబెల్ బహుమతి కన్నా ఎక్కువని ట్రంప్ తెలిపారు.
గతంలో పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత నాలుగు రోజులకు ఇరుదేశాల మిలిటరీ జనరల్స్ చర్చించుకుని కాల్పుల విరమణకు అంగీకరించారు. కానీ ఈ యుద్ధం తానే ఆపినట్లు ట్రంప్ అప్పటి నుంచీ చెప్పుకుంటూనే ఉన్నారు. దీన్ని భారత్ ప్రధాని మోడీ నేరుగా పలుమార్లు ఖండించారు. అలాగే పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్ కూడా భారత్ తమ వివాదాల్లో మూడో పక్షం మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ అంగీకరించలేదని చెప్పేశారు. అయినా ట్రంప్ మాత్రం తన మాటలు ఆపడం లేదు.












Click it and Unblock the Notifications