తన మాట జవదాటితే ట్రంప్ అన్నంత పనీ చేస్తాడు.. వాత పెట్టాడు.. !!
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్.
తాజాగా ట్రంప్ టారిఫ్ కు మరో దేశం బలి అయింది. దక్షిణ కొరియా దిగుమతులపై టారిఫ్ భారాన్ని పెంచారు. ఇప్పటివరకు వసూలు చేస్తోన్న టారిఫ్ ను 15 నుండి 25 శాతానికి పెంచారు. గత ఏడాది కుదిరిన వాణిజ్య ఒప్పందం లెజిస్లేచర్ ఆమోదం పొందకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని అన్నారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్స్, కలప, ఫార్మాస్యూటికల్స్‌తో పాటు ఇతర వస్తువులకు వర్తిస్తుంది.

ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొరియా పార్లమెంట్ తమ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించ లేదని, అందకే టారిఫ్ పెంచాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఒప్పందాలను తిరస్కరించే విశేషాధికారం ఆ దేశ పార్లమెంట్ కు ఉందని పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే ఆటోలు, కలప, ఫార్మా, ఇతర అన్ని రెసిప్రోకల్ టారిఫ్ ను 15 శాతం నుండి 25 శాతానికి పెంచుతున్నానని చెప్పారు.
అమెరికా టాప్ 10 వాణిజ్య భాగస్వామ్యుల్లో ఒకటి.. దక్షిణ కొరియా. అమెరికా కంపెనీలు, వినియోగదారులు ప్రతి సంవత్సరం ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ నుండి ఫార్మాస్యూటికల్స్, కలప వరకు సుమారు 150 బిలియన్ల డాలర్ల విలువైన కొరియన్ వస్తువులను దిగుమతి చేసుకుంటారు. ఈ వాణిజ్య ఒప్పందాన్ని ట్రంప్ జూలైలో సౌత్ కొరియా అధ్యక్షుడితో ప్రకటించినప్పటికీ చర్చలు కొలిక్కి రాలేదు. నెలల తరబడి సాగాయి. చివరికి ట్రంప్ ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాను సందర్శించినప్పుడు దీన్ని ఖరారు చేశారు.












Click it and Unblock the Notifications