తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోండి- ట్రంప్ హుకూం: కట్టుబట్టలతో..!!
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ఉధృతమౌతోంది. వరుసగా అయిదో రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్.. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇజ్రాయెల్ సాగిస్తోన్న దాడులతో ఇరాన్ పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్టయింది. అటు అమెరికా సైతం ఇజ్రాయెల్ వైపే మొగ్గు చూపడం, ఇరాన్ కు హెచ్చరికలను జారీ చేయడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కండిషన్లకు ఇరాన్ అంగీకరించకపోతే ఇజ్రాయెల్ కు సైనిక సహకారాన్ని కూడా అందించడానికి అమెరికా వెనుకాడకపోవచ్చు.
ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ లో మరణించిన వారి సంఖ్య 224కు చేరుకుంది. వారిలో ఎక్కువమంది సాధారణ ప్రజలేనని ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్ లో ఇప్పటివరకు 24 మంది మరణించారు. ఇరాన్ క్షిపణి దాడుల వల్ల దాదాపు 3,000 మందికి స్థానికులు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.
ఈ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేశారు. టెహ్రాన్ సిటీని తక్షణమే వదిలి వెళ్లాలని ఆదేశించారు. ఆ నగరాన్ని వెంటనే ఖాళీ చేయాలని హుకూం జారీ చేశారు. టెహ్రాన్.. ఓ యుద్దక్షేత్రంగా మారిందని, అక్కడ ఉండటం ఏ మాత్రం సురక్షతం కాదని తేల్చి చెప్పారు.
దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ పై పోస్ట్ చేశారు ట్రంప్. ఇరాన్ ను తప్పు పట్టారు. తాను సూచించిన విధంగా ఆ ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉంటే ఇంత విధ్వంసం జరిగేది కాదని అన్నారు. ఇరాన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని, దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయాలని పదే పదే చెప్పానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అందరూ వెంటనే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని ట్రంప్ సూచించారు. ఆ కొద్దిసేపటికే- టెహ్రాన్ పై దాడులు ముమ్మరం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నగరం మొత్తం సైరన్ మోతలు వినిపించాయి.
అర్ధరాత్రి దాటిన వెంటనే టెల్ అవీవ్ అంతటా వైమానిక దాడుల సైరన్లు కూడా మోగాయి, ఆ తర్వాత పేలుడు శబ్దం వినిపించింది, ఇరానియన్ క్షిపణులు మరోసారి ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. తాజా దాడి వరుసగా ఐదవ రోజు కూడా కొనసాగుతున్న శత్రుత్వాల కొనసాగింపును సూచిస్తుంది.












Click it and Unblock the Notifications