తైవాన్ పై డ్రాగన్ వార్ .. సరిహద్దులో బలగాల మోహరింపు.. ఏ క్షణంలోనైనా దాడి ?
డ్రాగన్ కంట్రీ చైనా యుద్ధానికి సిద్ధం అవుతోందా ? లద్దాఖ్ ఘర్షణతో భారత్ తో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న చైనా మరోవైపు తైవాన్ కబ్జాకు రంగం సిద్ధం చేసుకుంటోందా ? ఇప్పటికే భారీగా బలగాలను మోహరించి యుద్ధానికి సిద్ధం కావాలని చెప్తున్న చైనా ఏ క్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

చైనా దురాక్రమణ కోసంభారీగా మోహరించిన డ్రాగన్ సైన్యం
తాజాగా చైనా తీరు, సరిహద్దుల్లో చైనా వ్యూహాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
తాజాగా తైవాన్ దురాక్రమణ కోసం డ్రాగన్ కంట్రీ తన బలగాలను ఆగ్నేయ తీరంలో భారీగా మోహరిస్తోంది . తాజాగా పాత డీఎఫ్ 11, డీఎఫ్ 15 క్షిపణులను తొలగించి వాటి స్థానంలో అధునాతనమైన హైపర్ సోనిక్ డీఎఫ్ 17 క్షిపణులను మోహరించిన చైనా దళాలు తైవాన్ ని టార్గెట్ చేస్తుంది అని గట్టి సంకేతాలు ఇస్తున్నాయి. అలాగే ఫుజియాన్ ,గ్వాన్‌డాంగ్‌లోని రాకెట్ ఫోర్స్, మెరైన్ కార్ప్స్ స్థావరాలను సైతం విస్తరించినట్లు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న కన్వా డిఫెన్స్ రివ్యూ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తెలుస్తోంది.

తైవాన్ పై సైనిక చర్యకు సిద్ధం అవుతున్న చైనా ?
ఇటీవల చైనా తైవాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతుంది.
ఇక తైవాన్ విషయానికి వస్తే తైవాన్ ఎప్పుడూ చైనా కమ్యూనిస్టు పార్టీ పాలనలో లేదు. అది స్వతంత్ర ప్రతిపత్తితో కొనసాగుతోంది. కానీ చైనా తైవాన్ తమ అంతర్భాగంగా వాదిస్తోంది . తైవాన్ ను చేజిక్కించుకోవడం కోసం చైనా సైనిక చర్యకు దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఇదే విషయాన్ని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా చెప్పారు. తైవాన్ ను హస్తగతం చేసుకోవడానికి చైనా బలగాలు సన్నద్ధంగా ఉండాలని, యుద్ధం కోసం సర్వశక్తులు కూడగట్టుకోవాలి అని జిన్ పింగ్ ఆదేశించారు.

యుద్ధ సంకేతాలు ... ఏ క్షణంలో అయినా దాడి
మరోపక్క కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అమెరికాతో వాణిజ్య యుద్ధం చేస్తున్న చైనా, ఇప్పుడు తైవాన్ విషయంలో వేస్తున్న అడుగులు యుద్ధ సంకేతాలను ఇస్తున్నాయి.
ఇటీవల చైనా తైవాన్ చుట్టూ సైనిక కసరత్తులు పెంచింది. దాదాపు 40 చైనా యుద్ధ విమానాలు ప్రధాన భూభాగం మరియు తైవాన్ మధ్య మధ్యస్థ రేఖను దాటాయి.దీంతో ఇప్పుడు ఉదిక్త వాతావరణం నెలకొంది. ఏ సమయంలో అయినా దాడి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది .

చైనా తీరుపై గతంలోనే తైవాన్ అధ్యక్షుడి ఆగ్రహం
చైనా దుందుకుడు చర్యలపై గతంలోనే తైవాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది . చైనా కావాలని ఉద్రిక్తతలను రేకెత్తిస్తుందని తైవాన్ అధ్యక్షులు సాయ్ ఇంగ్ వెన్ నెల రోజుల క్రితమే ఆరోపించారు. జలసంధిలో చైనా యుద్ద విమానాలు 40 సార్లు తిరిగాయని , యుద్ద విమానాలు, బాంబర్లతో చైనా ఘర్షణ వాతావరణం సృష్టించటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జలసంధిలో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ ఫైరయ్యారు. తైవాన్ ఊహించినట్టే చైనా ఇప్పుడు తైవాన్ దురాక్రమణకు పాల్పడే వ్యూహంలో ఉంది.