మళ్లీ భారీ భూకంపం- భారత్ చుట్టూ..!!
Afghanistan earthquake 2025: భారత్‌కు పొరుగునే ఉన్న మయన్మార్, థాయ్‌లాండ్‌లల్లో సంభవించిన భూకంపం మిగిల్చిన ప్రాణ, ఆస్తినష్టం అంతా ఇంతా కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన పెను భూకంపాలు ఈ రెండు దేశాలను కుదిపిపడేశాయి. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి.
ఈ ప్రకృతి విపత్తు బారిన పడి 150 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. పలువురు వాటి శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భవనాల శిథిలాలను తొలగిస్తోన్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగొచ్చు.

అదే సమయంలో- పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు దీనివల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. దీని తీవ్రత అటు పాకిస్తాన్, తజకిస్తాన్‌లోనూ కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్ సహా మూడు దేశాల్లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.
తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా రికార్డయింది. ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:16 నిమిషాలకు భూమి కంపించింది. రాజధాని కాబుల్‌కు ఈశాన్య దిశగా ఉన్న టఖర్ ప్రావిన్స్‌లోని యెమెన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.
భూ ఉపరితలం నుంచి 180 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.
ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లు బీటలు వారినట్లు వార్తలొస్తోన్నాయి.
కాగా ఈ భూకంప తీవ్రత పాకిస్తాన్, తజకిస్తాన్‌లల్లో కనిపించింది. టఖర్ ప్రావిన్స్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న ప్రాంతం కావడం వల్ల తజకిస్తాన్‌లో పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. అలాగే.. పాకిస్తాన్ ఉత్తర- ఆగ్నేయ ప్రాంతం పరిధిలో పలుచోట్ల దీని తీవ్రత నమోదైంది.
2023 అక్టోబర్‌లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1,500 మంది వరకు మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టం అయ్యాయి అప్పట్లో.












Click it and Unblock the Notifications