చెట్టుకు కట్టేసి... విషపూరిత చీమలతో కుట్టించి...
కారు దొంగతనం చేశారనే ఆరోపణలపై ఓ తల్లీకూతుళ్ళను, కొడుకుని చెట్టుకు కట్టేసి, ఆపైన విషపూరిత చీమలతో కుట్టించి చంపేందుకు ప్రయత్నించిన ఘటన ఇది.
బొలీవియా: అందరూ ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకుంటున్న వేళ.. ఓ కుటుంబం మాత్రం ఈ భూమ్మీదే నరకం అనుభవించింది. కారు దొంగతనం చేశారనే ఆరోపణలపై కొంతమంది ఓ తల్లీకూతుళ్ళను, కొడుకుని చెట్టుకు కట్టేసి, వారి కళ్ళకి గంతలు కట్టి, ఆపైన విషపూరిత చీమలతో కుట్టించి చంపేందుకు ప్రయత్నించారు.
సరిగ్గా కొత్త సంవత్సరం రోజున జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ అమెరికాలోని బొలీవియా ప్రావిన్స్ లో ఉన్న కరనావి మునిసిపాలిటీలో ఈ దారుణం చోటుచేసుకుంది.
పాపం.. విషపూరిత చీమలు శరీరాన్ని కొరికి కొరికి తింటుంటే.. వారు చేసిన ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగినాఈ శిక్ష విధించిన స్థానికుల గుండెలు మాత్రం కరగలేదు. చివరికి తేలిందేమిటంటే.. అసలు కారు దొంగతనానికి బాధిత కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని. అయ్యో.. ఎంత ఘోరం.. ఎంత పాపం!

ఈ హృదయ విదారక ఘటన వివరాలు పరిశీలిస్తే... స్థానికంగా నివసించే ఓ కుటుంబానికి చెందిన కారు ఇటీవల చోరీకి గురైంది. అది సమీపంలో ఉండే యువకుడి పనేనని అనుమానించిన కొందరు వ్యక్తులు అతడిని పట్టుకొచ్చి ఓ చెట్టుకు కట్టేశారు.
దక్షిణ అమెరికా తీర ప్రాంతంలో కనిపించే ఈ రకం చెట్లను పాలో శాంటో అని పిలుస్తారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఈ చెట్లు ఉన్న ప్రతిచోట బ్రెజిలియన్ ఫైర్ రకం చీమలు కుప్పలు తెప్పలుగా నివాసం ఉంటాయి. ఇవి గనుక కుడితే నరకం భూమ్మీదే కనిపిస్తుంది.
వారి చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి సోదరి, తల్లి (52) ని కూడా ఈడ్చుకొచ్చి అదే చెట్టుకు కట్టేశారు. అంతే.. ఇంకేముంది? విషపు చీమలు బయటికొచ్చి వారి మీద దాడి చేయడం ప్రారంభించాయి.
చీమలు శరీరాలను కొరికి వేస్తుండగా వారు బాధతో కేకలు పెట్టారు. వదిలిపెట్టమని ప్రాధేయపడినా ఈ పనికి పాల్పడిన వారి హృదయాలు చలించలేదు. అందరూ చోద్యం చూస్తూ మిన్నకుండిపోయారు.
చివరికి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఒళ్లంతా గాయాలతో ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విషపు చీమలు తల్లి గొంతును చీల్చుకుని లోపలికెళ్ళి అక్కడి భాగాలను కొరికి తినడంతో ఆమె మరణించింది.
ప్రస్తుతం అన్నాచెల్లెళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, అయితే అసలు కారు చోరీకి, బాధిత కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని స్థానిక పోలీసు అధికారి గుంటెర్ అగుడో తెలిపారు.












Click it and Unblock the Notifications