బిగ్ అలర్ట్: ఎల్ నినో డేంజర్ బెల్స్.. శీతాకాలంపై బిగ్ వార్నింగ్!
ఈ ఏడాది రాబోయే శీతాకాలంలో కాలిఫోర్నియాతో పాటు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులు తలెత్తనున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1950 నుంచి ఇప్పటివరకు నమోదైన అత్యంత తీవ్రమైన ఎల్ నినోల కంటే ఇది మరింత శక్తివంతంగా ఉండే అవకాశముందని, వాతావరణ సంకేతాలు తీవ్ర ముప్పును సూచిస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త డేనియల్ స్వైన్ తెలిపారు.
వేగంగా వేడెక్కుతున్న భూగోళ వాతావరణంలో ఇంతటి భారీ ఎల్ నినో ప్రభావాన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదని, ప్రస్తుత డేటాను పరిశీలిస్తే భయాందోళన వ్యక్తం కావడం సహజమేనని స్వైన్ పేర్కొన్నారు. ఈ ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల కాలిఫోర్నియాలో భారీ వర్షాలు, తుఫానులు, తీవ్ర నష్టం కలిగించే వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి.

ఈ అసాధారణ పరిస్థితుల వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తీవ్రమైన ఈదురుగాలులు, తీరప్రాంత వరదలు, బీచ్ కోత ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను ముందే గ్రహించిన కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్, ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు, శీతాకాలపు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా గత నెలలోనే రాష్ట్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
అమెరికాలోని ఆరు రాష్ట్రాలు ఈ శీతాకాలంలో అత్యంత తీవ్రమైన వర్షపాతం, భారీ హిమపాతాన్ని ఎదుర్కోనున్నాయి. కాలిఫోర్నియాతో పాటు నెవాడా, ఉతా, కొలరాడో, న్యూ మెక్సికో, అరిజోనా రాష్ట్రాలపై ఈ ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ రాష్ట్రాల్లోని పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాల్లో సగటు కంటే చాలా ఎక్కువగా హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.














Click it and Unblock the Notifications
