GST వ్యాపారులకు బిగ్ రిలీఫ్: కౌన్సిల్ సంచలన నిర్ణయాలు -అరెస్ట్ పవర్స్ రద్దు!
దేశవ్యాప్తంగా వ్యాపారులకు జీఎస్టీ కౌన్సిల్ ఇవాళ శుభవార్తలు (GST Council Reforms 2027) చెప్పింది. అసలే అంతంత మాత్రంగా సాగుతున్న తమ వ్యాపారాలపై జీఎస్టీ పేరుతో పన్నుల మోత, అరెస్టులు, ప్రాసిక్యూషన్ లు, జరిమానాల విధింపు భారంగా మారాయన్న విమర్శల నేపథ్యంలో ఇవాళ సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పన్ను వసూళ్ల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు చారిత్రాత్మక సంస్కరణలకు ఆమోదం తెలిపారు.
వ్యాపార వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందిస్తూ, జీఎస్‌టీ అధికారులకు ఇప్పటివరకు ఉన్న అనుమానితులను అరెస్ట్ చేసే అత్యున్నత అధికారాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది. తాజా నిబంధనల ప్రకారం పన్ను ఎగవేతదారులపై క్రిమినల్ చర్యలు లేదా ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి ఉన్న పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.కోటి నుంచి ఏకంగా రూ.5 కోట్లకు పెంచారు. చట్టంలో ఉన్న కనీస శిక్షా కాలాన్ని రద్దు చేసి, తదుపరి శిక్ష లేదా జరిమానా నిర్ణయాన్ని పూర్తిగా కోర్టుల విచక్షణకే వదిలేశారు. నిర్దిష్ట నిబంధనలు వర్తించని సాధారణ జరిమానా పరిమితిని కూడా 25 వేల నుంచి 10 వేలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై 10 వేల కంటే తక్కువ విలువ ఉండే పన్ను వివాదాలపై కొత్తగా నోటీసులు జారీ చేయకూడదని నిర్ణయించారు. గతంలో జారీ చేసిన ఇలాంటి చిన్న నోటీసులు ఏవైనా పెండింగ్‌లో ఉంటే, వాటిని వెంటనే వెనక్కి తీసుకుంటారు. పన్ను చెల్లింపుల్లో ఆలస్యం లేదా చిన్న సాంకేతిక పొరపాట్లు జరిగితే దానికి తగిన వడ్డీ, దామాషా ప్రకారం పెనాల్టీ మాత్రమే విధిస్తారు తప్ప అంతకు మించి వేధింపులు ఉండవని భరోసా ఇచ్చారు. దేశంలో వ్యాపార సానుకూల వాతావరణాన్ని మరింత పెంపొందించేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

పన్నుల రేట్లను మార్చడం కంటే, పన్ను వసూలు చేసే విధానాల్లో సంస్కరణలు తీసుకురావడంపైనే మండలి ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. పన్ను చెల్లింపుదారులను నమ్మడం ద్వారానే వ్యవస్థ బలోపేతం అవుతుందని, అధికారులు అనవసరంగా వ్యాపార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదించిన ఈ ప్రతిపాదనలు 2027 ఏప్రిల్ 1 నుండి అధికారికంగా అమలులోకి వస్తాయి. అయితే ఆర్థిక ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతలు, తీవ్రమైన నేరాల విషయంలో మాత్రం చట్టప్రకారం క్రిమినల్ విచారణలు కొనసాగుతాయని మంత్రి వివరించారు.














Click it and Unblock the Notifications
