సౌదీ ఎయిర్ పోర్టులపై హైతీల దాడులు.. విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
సౌదీ అరేబియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. రియాద్ లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆభా అంతర్జాతీయ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని హూతీ దళాలు దాడులకు పాల్పడ్డాయి. రియాద్ లోని విమానాశ్రయాలపై బాలిస్టిక్ మిస్సైల్స్ తో దాడి చేసినట్లు హౌతీ దళాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్ కు చెందిన పలు విమానయాన సంస్థలు రియాద్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి.
ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్ ప్రెస్ రియాద్ కు సర్వీసులు రద్దు చేశాయి. తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా దిల్లీ నుంచి రియాద్ వెళ్తున్న విమానం మధ్యలోనే వెనక్కి మళ్లించారు. ఈ మేరకు ఈ నెల 10 వరకు రియాద్‌కు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్ ప్రెస్ తాజాగా ప్రకటనను విడుదల చేశాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాయి. రద్దు అయిన టికెట్లకు పూర్తి రిఫండ్ లేదా ఉచితంగా మరో తేదీకి మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపాయి.
మరోవైపు సౌదీలోని ఎయిర్ పోర్ట్ లతో పాటు కీలక ప్రాంతాలపై హౌతీల దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ మేరకు సౌదీలోని పౌరులకు కీలక సూచనలు చేసింది. అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. హౌతీ దళాల తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో సౌదీలోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం ఈ కీలక సూచనలు జారీ చేసింది. సౌదీలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైన సందర్భాల్లో ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.

అలాగే సౌదీపై హౌతీ దళాల దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఈ మేరకు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపింది. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అంతేకాక భారత ప్రభుత్వం.. సౌదీ ప్రజలకు.. అక్కడి ప్రభుత్వానికి అండగా ఉంటుందని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications
