మస్క్ స్టార్‌లింక్ ఆరోపణల ఎఫెక్ట్? రిలయన్స్ షేర్లు 2.6% డౌన్..!!
భారతీయ స్టాక్ మార్కెట్లో కీలకమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా నష్టపోయాయి. ప్రముఖ అంతర్జాతీయ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు ప్రతికూల మార్కెట్ పరిస్థితుల వల్ల గురువారం నాటి ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్ విలువ సుమారు 2.6 శాతం క్షీణించింది. ఈ పతనంతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ నికర సంపద విలువ దాదాపు రూ.21,200 కోట్లు మేర హరించుకుపోయింది.
ముఖ్యంగా నిఫ్టీ 50 సూచీలో దాదాపు 1.7 శాతం లేదా 384 పాయింట్ల పతనానికి రిలయన్స్ షేర్ల నష్టాలే ప్రధాన కారణమయ్యాయి. సూచీలో దాదాపు 9 శాతం వాటా కలిగిన రిలయన్స్ పతనం వల్ల నిఫ్టీ అధిక ఒత్తిడికి లోనైంది. దీనికి తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల నిర్ణయాలపై నెలకొన్న అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 104 డాలర్ల సమీపానికి చేరడం, విదేశీ పెట్టుబడిదారుల వరుస విక్రయాలు మార్కెట్ పతనానికి ఆజ్యం పోశాయి.

ఎలాన్ మస్క్ ఆరోపణలు - కేంద్రం స్పందన
భారతదేశంలో స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి రాకుండా కొందరు స్థానిక సంపన్న వ్యాపారవేత్తలు (అలిగార్క్స్) అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. భారత ప్రజలపై తమ వ్యాపార గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికే వారు ఇలా చేస్తున్నారని, ఇది ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరమని ఆయన పేర్కొన్నారు. అయితే మస్క్ ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, మస్క్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది. స్టార్‌లింక్, జియో శాటిలైట్, భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్ సంస్థలు ఇప్పటికే లైసెన్సులు కలిగి ఉన్నాయని, కేవలం భద్రతా అనుమతుల ప్రక్రియ మాత్రమే పెండింగ్‌లో ఉందని స్పష్టం చేసింది. తమ వన్‌వెబ్ కూడా అనుమతుల కోసం ఎదురుచూస్తోందని సునీల్ భారతీ మిట్టల్ తెలపగా, దీనిపై స్పందించేందుకు ఆకాష్ అంబానీ నిరాకరించారు.
జియో ప్లాట్‌ఫామ్స్ విలువ తగ్గింపు
రిలయన్స్ గ్రూప్ తన అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ను త్వరలో ఐపీఓకు తీసుకురావాలని వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ వివాదం తలెత్తింది. గతంలో ఈ సంస్థ విలువను 130 నుంచి 170 బిలియన్ డాలర్లుగా అంచనా వేయగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సుమారు 114 బిలియన్ డాలర్ల విలువతో మార్కెట్లోకి రావాలని యోచిస్తోంది. రిలయన్స్ సంస్థలో అంబానీ కుటుంబానికి ఉన్న 50.07 శాతం ప్రమోటర్ వాటా కారణంగా, షేర్ల ధర క్షీణత సుమారు రూ.21,200 కోట్ల కాగితపు నష్టాన్ని మిగిల్చింది.
రిలయన్స్‌తో పాటు మార్కెట్ ఒత్తిడి కారణంగా భారతీ ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐటీసీ, టైటాన్, పవర్‌గ్రిడ్ వంటి ఇతర దిగ్గజ స్టాక్స్ కూడా నష్టాలను చవిచూశాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల హెచ్చుతగ్గులు మరియు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాలు రాబోయే రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ గమనాన్ని శాసించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
