చేతులెత్తేసిన పాక్ ప్రభుత్వం! చుక్క నీరు.. యూనిట్ కరెంట్ కూడా కష్టమేనా?
పాకిస్తాన్ నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుల భవితవ్యం రాబోయే ఆర్థిక సంవత్సరంలో తీవ్ర ఆర్థిక అనిశ్చితిలో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా చేపట్టిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కొనసాగింపుపై నిధుల కొరత కారణంగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' నివేదిక ప్రకారం.. వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ అవసరాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నిర్ణయం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశంలోని నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు, అభివృద్ధి పథకాల కోసం జల వనరుల మంత్రిత్వ శాఖ మొత్తం రూ. 969 బిలియన్ల నిధులు అవసరమని అంచనా వేసింది. అయితే, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ ప్రభుత్వం కేవలం 179 బిలియన్ పాకిస్థానీ రూపాయల (PKR) కేటాయింపులకే పరిమితమైంది. ఈ భారీ నిధుల కొరత, దేశంలోని నీటి సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని మరియు భవిష్యత్తు ప్రాజెక్టుల మనుగడను తీవ్రంగా ప్రశ్నార్థకం చేస్తోంది.

ఒక్కటంటే ఒక్కటే కొత్త ప్రాజెక్టు!
వచ్చే ఆర్థిక సంవత్సరపు అభివృద్ధి ప్రణాళికలో 41 ప్రాజెక్టులు కొనసాగుతుండగా, కొత్తగా కేవలం ఒక్క పథకానికి మాత్రమే బడ్జెట్‌లో చోటు దక్కింది. ప్రతిష్టాత్మక 'దియామెర్-భాషా డ్యామ్'కు అనుబంధంగా ఉండే జలవిద్యుత్ కేంద్రం కోసం ప్రభుత్వం కేవలం PKR 500 మిలియన్లను కేటాయించింది. అదే సమయంలో ఈ ప్రాజెక్టు ప్రధాన అభివృద్ధి పనుల కోసం PKR 25 బిలియన్లు, దానితో ముడిపడి ఉన్న భూసేకరణ ప్రక్రియ కోసం మరో PKR 7 బిలియన్లను బడ్జెట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచారు.
మందగించనున్న డ్యామ్‌ల నిర్మాణం
అవసరమైన నిధులలో కనీసం అయిదవ వంతు (20 శాతం) కంటే తక్కువ కేటాయించడం వల్ల.. డ్యామ్‌లు, జలవిద్యుత్, సాగునీటి నిర్వహణ ప్రాజెక్టుల అమలు ప్రక్రియ గణనీయంగా మందగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిధుల అంతరం దేశంలోని పెరుగుతున్న నీటి, విద్యుత్ అవసరాలను తీర్చడంలో పెద్ద అడ్డంకిగా మారడమే కాకుండా, ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకుండా జాప్యం కలిగిస్తుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక గడ్డుకాలానికి నిదర్శనం
వ్యవసాయం, పరిశ్రమలకు జల మౌలిక సదుపాయాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవి అయినప్పటికీ, దేశ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి పెట్టుబడి సామర్థ్యాన్ని దారుణంగా పరిమితం చేస్తోంది. నిధుల కొరత, అభివృద్ధి లక్ష్యాల మధ్య పెరుగుతున్న ఈ భారీ వ్యత్యాసం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక గడ్డుకాలాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. నీటి రంగంలో సరైన పెట్టుబడులు లేకపోవడం దేశ దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications