అగ్నిగోళంలా తయారైన ఫ్రాన్స్: పారిస్ లో అల్లర్లు, దహనాలు, లూటీలు.. ఒక్కటేమిటి
ఫ్రాన్స్.. మంటలబారిన పడింది. పారిస్ సహా అనేక ప్రధాన నగరాలు తగులబడుతున్నాయి. అల్లర్లతో అట్టుడికిపోతున్నాయి. ఏకంగా 5,00,000 మందికి పైగా ఆందోళనకారులు ఒక్కసారిగా రోడ్లపైకి దూసుకొచ్చి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. తీవ్రతరమౌతోన్న అసంతృప్తి, ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఒక్కసారిగా పెల్లుబికాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఆందోళనలు దేశవ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందాయి.
రాజధాని పారిస్‌తో పాటు ఫ్రాన్స్ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో సుమారు 5.5 లక్షల మందికి పైగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చి విరుచుకుపడ్డారు. అనేక చోట్ల వాహనాలకు నిప్పు పెట్టడం, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయడం, లగ్జరీ దుకాణాలను లూటీ చేయడం.. పరిపాటిగా మారిందక్కడ. ఉపాధ్యాయుల సమ్మెకు మద్దతుగా మొదలైన ఈ ఉద్యమంలోకి కార్మిక సంఘాలు, ఎల్లో వెస్ట్ ఆందోళనకారులు సంఘీభావాన్ని ప్రకటించడంతో ఇది తీవ్రరూపం దాల్చింది.

ఫ్రాన్స్‌లో వచ్చే ఆరు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిరసనలు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిపక్ష లెఫ్టిస్ట్ పార్టీ నాయకుడు జీన్- లుక్ మెలెన్‌చోన్ ఈ ఆందోళనలకు మద్దతు తెలిపారు. విద్యా రంగానికి బడ్జెట్ కోతలు విధిస్తున్నారంటూ టీచర్లు, విద్యార్థులు మొదట రోడ్డెక్కారు. కార్మిక సంఘాలు వారికి తోడయ్యాయి. నిత్యావసరాల ధరల నియంత్రణ కోసం ఇతర ప్రజాసంఘాలు కూడా చేతులు కలపడంతో దీని స్వరూపమే మారిపోయింది.
భద్రతా దళాల కళ్లెదుటే నలుపు రంగు దుస్తులు ధరించిన అల్లరి మూకలు విధ్వంసానికి పూనుకున్నాయి. పారిస్, మార్సెల్, లియోన్ వంటి నగరాల్లో ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు. లూయిస్ విట్టన్, హెర్మిస్, ఆపిల్ వంటి బ్రాండెడ్ షోరూమ్‌ల అద్దాలు పగలగొట్టి వస్తువులను దోచుకెళ్లారు. లియోన్ ని ఓ టూరిజం సెంటర్‌కు నిప్పు పెట్టారు. మార్సెల్ మున్సిపల్ కార్యాలయంలో ఫ్రాన్స్ జాతీయ చిహ్నం మరియాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
ఈ హింసాత్మక పరిణామాలను ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా దాదాపు 400 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంది. ఒక్క పారిస్‌లోనే 110 మందిని అరెస్ట్ చేసినట్లు హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు పూర్తి హక్కు ఉంటుందని, ఆస్తుల ధ్వంసం, లూటీలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను స్పష్టం చేశారు.
రాజధాని పారిస్‌లోనే 40 వేల మంది నిరసనలో పాల్గోన్నారు. అలాగే, పారిస్‌లో ఆంక్షలు విధించారు. ఎలీజే అధ్యక్ష భవనం, ప్రధాని కార్యాలయం, షాంజెలిజే మార్గం సహా కీలక ప్రాంతాల్లో ర్యాలీలను నిషేధించారు. అనేక మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఈ ఆందోళనలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మెక్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతివాద వామపక్ష భావజాల శక్తులే నిరసనలను హింసాత్మకంగా మార్చాయని ఆరోపించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బహిరంగ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
