టీటీడీ ఈ-డిప్, రూ. 300 దర్శనం, వసతి గదుల బుకింగ్ తేదీలు వెల్లడి
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 77,759 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,977 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.96 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.
జనవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలకు సంబంధించిన కోటా టికెట్ల విడుదల తేదీలు, ఇతర వివరాలను టీటీడీ విడుదల చేసింది. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ వంటి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల అవుతాయి.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సొమ్ము చెల్లించిన వారికి మాత్రమే టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు 22న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల అవుతాయి. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా టికెట్లు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో పొందుపర్చుతుంది టీటీడీ. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల అవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా కూడా అదే రోజు ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయి.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. తిరుమల, తిరుపతిలలో వసతి గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.












Click it and Unblock the Notifications
