AP Election Holiday: ఏపీలో 28న ఎన్నికల సెలవు- స్కూళ్లు, కాలేజీలకు ఈ 2 రోజులు..!
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల పోలింగ్ కు అవసరమైన సిబ్బంది నియామకాలు, లాజిస్టిక్స్ ఏర్పాట్లు, ఇతర ఆదేశాలు ఇస్తోంది. ఇదే క్రమంలో పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు,, సంస్థలకు సెలవు (AP Election Holiday) కూడా ప్రకటించింది. దీంతో పాటు స్కూల్స్, కాలేజీలకు అదనంగా మరో సెలవు కూడా ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల్లో సెలవులు ప్రకటించాలని ఎస్ఈసీ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ఈ నెల 28న పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇతర సంస్ధలు, ప్రభుత్వ,, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సెలవు 28న సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. అలాగే పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవు ప్రకటిస్తూ తగు ఆదేశాలు ఇచ్చే అధికారాన్ని కూడా కలెక్టర్లకు వాడుకోవాలని ఎస్ఈసీ తెలిపారు.

అలాగే ప్రైవేటు దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజు పనిచేయిస్తే వేతనంతో కూడా సెలవు మంజూరు చేసేలా కార్మికశాఖ కమిషనర్ కు అధికారం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ రోజున ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలను వాడుకునేందుకు వీలుగా స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 28, 30 తేదీల్లో సెలవు ప్రకటించేలా కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎన్నికలు జరుగుతున్న అన్ని జిల్లాలు, ప్రాంతాల్లో ఈ మేరకు కలెక్టర్లు తమ అధికారాలను వాడుతూ సెలవులు ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. ఎన్నికల సంఘం, కలెక్టర్ల ఆదేశాలను ధిక్కరించి సంస్థలు సెలవులు ప్రకటించకుండా ఉంటే నిబంధనల ప్రకారం యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోబోతున్నారు.














Click it and Unblock the Notifications
