ఏపీ ఉద్యోగులకు దసరా కానుక..! త్వరలో ఐఆర్ ప్రకటన- ఎంత శాతమంటే?
ఏపీలో పీఆర్సీ ద్వారా వేతనాల పెంపునకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు (AP Employees) తాజాగా మరో గుడ్ న్యూస్ అందుతోంది. రాష్ట్రంలో తాజాగా పీఆర్సీ కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ దినేష్ కుమార్ ను నియమించడం, ఆయన బాధ్యతలు చేపట్టడం కూడా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యోగులకు దసరా కానుకగా తాత్కాలిక భృతి (ఐఆర్ ) ప్రకటించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. వీటిని పరిశీలిస్తున్న ప్రభుత్వం.. దసరా కానుకగా శుభవార్త చెప్పేందుకు సిద్దమవుతోంది.
స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో దసరా కానుకగా ఉద్యోగులకు 30 శాతం ఐఆర్ ప్రకటించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అధికారంలోకి రాగానే మెరుగైన ఐఆర్ ఇస్తామని చెప్పి 27 శాతం ప్రకటించి అమలు చేసింది. దీంతో ఇప్పుడు ఆ 27 శాతాన్ని మించి ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 శాతం ఐఆర్ ఇచ్చేలా ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.

వాస్తవానికి రాష్ట్రంలో పీఆర్సీ ఏర్పాటు తర్వాత క్షేత్రస్దాయిలో అధ్యయనం, ఆ తర్వాత ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే వరకూ మధ్యలో ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత ప్రభుత్వం పీఆర్సీని నియమించినా,అంతలోనే ప్రభుత్వం మారడంతో కమిషనర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో ఈ వ్యవహారం మూలనపడింది. రెండేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పీఆర్సీ కమిషనర్ ను నియమించి ఈ ప్రక్రియను గాడిలో పెట్టింది. అయితే పీఆర్సీ రిపోర్ట్ ఇచ్చేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆ లోపు ఐఆర్ ఇచ్చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఉద్యోగ సంఘాలతో అంతర్గతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న ఏపీఎన్జీవోల అధ్యక్షుడు విద్యాసాగర్ తో జరిపిన చర్చలు ఫలించినట్లు కూడా చెబుతున్నారు. అదే జరిగితే త్వరలోనే 30 శాతం ఐఆర్ పై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
